Russia Ukraine War Update : రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లో 15 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 100 డ్రోన్‌లు, 100కిపైగా క్షిపణులతో రష్యన్ బలగాలు దాడి చేశాయి. అర్ధరాత్రి మొదలైన ఈ దాడులు సోమవారం ఉదయం వరకు సాగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా మరో నలుగురు ఉక్రెయిన్ పౌరులు గాయపడినట్లు తెలిపింది.
తమ దేశంలోని తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించినట్లు ఉక్రెయిన్ తెలిపింది. రష్యన్ డ్రోన్‌లు, బహుళ క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు పలు ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది. రాజధాని కీవ్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు పేర్కొంది. దాడులు కారణంగా కీవ్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. ప్రస్తుతం విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనులు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉక్రెయిన్‌లోని లుట్స్క్ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంపై రష్యన్ డ్రోన్ జరిపిన దాడిలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ డెనిప్రోలో జరిగిన మరో దాడిలో మరొకరు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడిలో డజన్ల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమైనట్లు వెల్లడించారు. శిథిలాల కింద నుంచి ఒక వ్యక్తిని రక్షించినట్లు తెలిపారు. జపోరిజియా ప్రాంతంలో మరొక పౌరుడు మరణించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన దాడిలో భవనాల్లో మంటలు చెలరేగాయని వెల్లడించారు.
రెండు ప్రాంతాలు ఉక్రెయిన్ అధీనంలోకి!
మైకోలైవ్‌లోని నివాసిత ప్రాంతాలపై రష్యా క్షిపణుల దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు వివరించారు. శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలోని ఓ హోటల్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఓ బ్రిటిష్ పాత్రికేయుడు మరణించినట్లు ఉక్రెయిన్ ధ్రువీకరించింది. మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్‌లో మరో రెండు ప్రాంతాలు తమ అధీనంలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. తమ బలగాలు మూడు కిలోమీటర్ల దూరం దూసుకెళ్లాయని చెప్పారు.
20 డ్రోన్లను నేలకూల్చిన రష్యా!
ఇదే సమయంలో రష్యాపై ఉక్రెయిన్ వరుస డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యాలోని సరతోవ్, యారోస్లావ్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో 22 డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది. వీటిలో 20 డ్రోన్లను నేలకూల్చినట్లు తెలిపింది. ఈ దాడిలో నలుగురు పౌరులు గాయపడినట్లు వెల్లడించింది. సరతోవ్‌లోని ఎత్తైన భవనంలోకి ఉక్రెయిన్ డ్రోన్ దూసుకెళ్లింది. ఈ దాడిలో ఇద్దరు గాయపడగా, భవనంలోని కొంత భాగం ధ్వంసమైంది.
ఎల్లప్పుడూ శాంతివైపే భారత్- ఉక్రెయిన్, రష్యా చర్చించుకోవాల్సిందే!: మోదీ - Modi Zelensky Talks