Russia Ukraine War : రష్యా, ఉక్రెయన్ యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా ఇరుదేశాలు మరోసారి పరస్పరం దాడులు, ప్రతిదాడులకు దిగాయి. ఉక్రెయిన్ ప్రాంతాలపై రష్యా బలగాలు దాడులు చేయగా, అందుకు ప్రతీకారంగా ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లతో ప్రతీదాడులకు దిగింది. కీవ్ సహా పలు ప్రాంతాల్లో రష్యా 62 డ్రోన్లు, ఒక క్షిపణితో దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ధ్రువీకరించింది. వీటిల్లో దాదాపు 50కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది.
ఉక్రెయిన్ గ్రామం స్వాధీనం
కీవ్‌లోని ఓ నివాసిత భవనం, కిండర్ గార్టెన్‌పై రష్యా డ్రోన్ పడిందని వెల్లడించింది. ఈ దాడిలో ఓ చిన్నారి సహా తొమ్మిది మంది గాయపడ్డారని పేర్కొంది. ఇందుకు ప్రతీకారంగా రష్యాపై ఉక్రెయిన్ బలగాలు డ్రోన్లతో విరచుకుపడ్డాయి. పశ్చిమ, దక్షిణ ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్ల దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 25 డ్రోన్లను కూల్చివేసినట్లు పేర్కొంది. అటు ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలోని క్రుహ్ల్యకివ్కా గ్రామాన్ని తమ బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
398 సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షలు
మరోవైపు, ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్నాయి అంటూ దాదాపు 398 సంస్థలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధించింది. రష్యా యుద్ధానికి సహకరించేలా ఉత్పత్తులు, సేవల్ని అందింస్తూ ఆంక్షల్ని తప్పించుకునేందుకు ఆ దేశానికి సహకరిస్తున్నాయని వీటిని తప్పుపట్టింది. అమెరికా ఆంక్షలు విధించిన జాబితాలో రష్యా, భారత్, చైనా, మరో డజను పైగా ఇతర దేశాలకు చెందిన మెుత్తం 398 సంస్థలు ఉన్నాయి.
ఇందులో 274 సంస్థలు రష్యాకు ఆధునాతన సాంకేతికను సరాఫరా చేస్తున్నాయని అమెరికా ఆరోపించింది. కొన్ని సంస్థలు ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించే ఆయుధాలను నిర్వహించే సైనిక ఉత్పత్తులను తయారు చేసే రష్యా సంస్థలు కూడా ఉన్నాయని అమెరికా చెప్పింది. 2022లో ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మెుదలయ్యాక విధించిన వేలకొద్ది ఆంక్షలను తప్పించుకునేలా రష్యాకు ఈ దేశాల కంపెనీలు సహకరిస్తున్నాయని అమెరికా మండిపడింది.