Russia Attack On Ukraine : ఉక్రెయిన్‌పై ఒక్క రోజులోనే 99 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది రష్యా. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. వీటిని దీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ పలుచోట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. గగనతల దాడులతో తమ విద్యుత్ సరఫరా వ్యవస్థల్లో తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపింది. దేశంలో అనేకచోట్ల కరెంటు కోతల ముప్పు ఉందని హెచ్చరించింది.
విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం
అయితే ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటికే పలు నగరాలను నేలమట్టం చేశాయి పుతిన్ సేనలు. కొన్నిరోజులుగా వైమానిక దాడులను తగ్గించాయి. కానీ రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ పాల్పడుతున్న దాడులకు ప్రతిస్పందనగా ఎదురు దాడులను పెంచాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బొగ్గు, జల విద్యుత్ కేంద్రాలపై డ్రోన్లు, క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఉక్రెయిన్ మొత్తం వార్నింగ్ బెల్స్!
విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా తరచూ దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇటీవలే ఈ ముప్పు మరింత పెరిగిందని చెప్పింది. పలుచోట్ల విద్యుత్ అంతరాయాలను ప్రకటించినట్లు ప్రధానమంత్రి డెనిస్ ష్మిగల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు అవసరమని ఈ దాడులు నిరూపిస్తున్నాయని చెప్పారు. వరుస క్షిపణి దాడులతో ఉక్రెయిన్ మొత్తం వార్నింగ్ బెల్‌లు మోగుతూనే ఉన్నాయని చెప్పారు.
ఇంధన ఉగ్రవాదం : జెలెన్‌స్కీ
అయితే 2022-23 శీతాకాలంలో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించింది రష్యా. అప్పుడు కూడా విద్యుత్ వ్యవ్యస్థలపై దాడులు చేసింది. ఇప్పుడు కూడా అలాంటి దాడులే చేస్తోంది. ఇక ఈ దాడులను ఇంధన ఉగ్రవాదంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అభివర్ణించారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి కూడా ఈ తరహా దాడులు అక్రమమని పేర్కొంది.
'నాటో దేశాలపై దాడులు చేయం'
మరోవైపు, నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. టోర్జోక్ ప్రాంతంలో ఉన్న రష్యా వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. అక్కడి పైలట్లతో ముచ్చటించిన ఆయన కొద్దిసేపు సైనిక హెలికాఫ్టర్‌లోని సిమ్యులేటర్‌లో కూర్చుని దాన్ని పరిశీలించారు.
'ఉగ్రదాడి వెనక అమెరికా, యూకే, ఉక్రెయిన్ హస్తం'- ఐసిస్ ప్రకటించినా రష్యా ఎందుకిలా అంటోంది?
కరెంట్ షాక్‌తో ఇంటరాగేషన్!- నేరాన్ని ఒప్పుకున్న రష్యా ఉగ్రదాడి నిందితులు