Putin Mongolia Visit : రష్యా అధక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం(ICC) వారెంట్ ఉన్న నేపథ్యంలో ఆయన మంగోలియా పర్యటనకు వెళ్లనుండడం చర్చనీయాంశమైంది. రెండో ప్రపంచయుద్ధం జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 3న వ్లాదిమిర్ పుతిన్ మంగోలియా వెళ్లనున్నారు.
'పుతిన్‌ను అప్పగించాలి'
ఉక్రెయిన్‌లోని ఆక్రమితప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ గతేడాది పుతిన్‌కు ఐసీసీ వారెంట్ జారీ చేసింది. వారెంట్ జారీ అయిన తర్వాత తొలిసారి ఐసీసీ సభ్యత్వం ఉన్న దేశంలో పుతిన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంగోలియా పర్యటనలో ఆయనను ఐసీసీ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఐసీసీలో గోలియా సభ్యదేశంగా ఉండటం వల్ల పుతిన్ అక్కడికి వెళ్లినప్పుడు ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పుతిన్‌ను ఐసీసీకి అప్పగించాలని మంగోలియాను ఉక్రెయిన్ కోరినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయ అరెస్టు వారెంట్‌ను పాటించాలని, పుతిన్‌ను హేగ్‌లోని ఐసీసీకి అప్పగించాలని మంగోలియా అధికారులను ఉక్రెయిన్ విదేశాంగ శాఖ కోరినట్లు కథనాలు పేర్కొన్నాయి.
'అరెస్ట్ వారంట్‌పై ఆందోళన అవసరం లేదు'
ఈ అనుమానాలపై స్పందించిన క్రెమ్లిన్, పుతిన్ అరెస్టు వారెంట్‌పై చింతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మంగోలియాతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమ్రితి పెస్కోవ్ పేర్కొన్నారు. ఐసీసీ అధికార పరిధిని తాము గుర్తించడంలేదని మరోసారి నొక్కి చెప్పారు. 2015లో సుడాన్ మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ ఐసీసీ వారెంట్ ఉన్నా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఆయనను ఐసీసీ అరెస్టు చేయలేదు. దక్షిణాఫ్రికా ఐసీసీ సభ్యదేశమైన ఆయనను అరెస్టు కాలేదు.
గతేడాది మార్చిలో పుతిన్‌కు ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే రష్యాలో ఉన్నంతవరకు పుతిన్‌ను అరెస్టు చేయడం అసాధ్యం. ఒకవేళ రష్యాను వీడితే మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని పలు నివేదికలు వెల్లడించాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్‌పై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడం వల్ల ఆయన ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పుతిన్ మంగోలియాను సందర్శిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరెస్ట్ వారెంట్.. స్వాగతించిన ఉక్రెయిన్