PM Modi Austria Visit Updates : ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో తాను ఫలవంతమైన చర్చలు జరిపానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, పశ్చిమాసియాలోని పరిస్థితులు సహా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వివాదాలపై తామిద్దరం చర్చించుకున్నామని పేర్కొన్నారు. ఇది యుద్ధ సమయం కాదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. యుద్ధభూమిలో సమస్యలు పరిష్కారం కావని అభిప్రాయపడ్డారు. ఎక్కడైనా అమాయకుల ప్రాణాలు కోల్పోవడం ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బలపడిన బంధం!
"నాకు లభించిన ఘన స్వాగతానికి ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని స్థాయిలో ఆస్ట్రియాను సందర్శించాను. భారత్-ఆస్ట్రియా మధ్య ఫలప్రదమైన దౌత్యపరమైన చర్చలు జరిగాయి. భారత్- ఆస్ట్రియా పరస్పర సహకారాన్ని అందించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే దశాబ్దంలో సహకారం కోసం బ్లూప్రింట్‌ను తయారు చేసుకున్నాయి. యుద్ధభూమిలో సమస్యలకు పరిష్కారాలు దొరకవు. భారత్- ఆస్ట్రియా దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ సమావేశం ఐరోపాలో శాంతి, స్థిరత్వానికి దిశానిర్దేశం చేసింది. భారత్- ఆస్ట్రియా ద్వైపాక్షిక సంబంధాలు 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నా పర్యటన జరగడం ఆనందంగా ఉంది. మొబిలిటీ, మైగ్రేషన్ పార్టనర్‌షిప్‌పై ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరింది. ఇది చట్టపరమైన వలసలను, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తరలించడాన్ని సులభతరం చేస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, నీరు, వ్యర్థాల నిర్వహణ, కృత్రిమ మేధస్సు, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాం" అని ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో కలిసి పాల్గొన్న మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
#WATCH | Vienna: PM Modi says, " i am happy that during the beginning of my third term itself, i got the opportunity to visit austria. this trip of mine is historic and special. after 41 years, an indian pm has visited austria...today, between austrian chancellor karl nehammer… pic.twitter.com/3J0ygHw0Ea
— ANI (@ANI) July 10, 2024
#WATCH | Vienna: PM Modi says, " we discussed the biggest challenges humanity is facing right now, including climate change and terrorism. in the climate subject, we are inviting austria, to join our initiatives like international solar alliance, collision for disaster resilient… pic.twitter.com/AguB7JhLs7
— ANI (@ANI) July 10, 2024
సవాళ్లు ఉన్నాయి!
వాతావరణ మార్పు, ఉగ్రవాదం వంటి మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆస్ట్రియా- భారత్ పరస్పరం ఆలోచనలు పంచుకున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, బయోఫ్యూయల్ అలయన్స్ వంటి కార్యక్రమాల్లో ఆస్ట్రియా చేరాలని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఇరుదేశాలు ఖండిస్తున్నాయని, అది ఏ మాత్రం అమోదయోగ్యం కాదని అభిప్రాయపడుతున్నాయని వెల్లడించారు.
'రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి మోదీతో చర్చించా'
రష్యా-ఉక్రెయిన్ శాంతి ప్రక్రియలో భారత్ ముఖ్యమైన దేశమని ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ వివాదంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు వెల్లడించారు. 'భారత ప్రధాని మోదీతో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై చర్చలు జరిపాను. యుద్ధం విషయంలో రష్యాపై భారత్ వైఖరిని ఆస్ట్రియా ఫెడరల్ ఛాన్సలర్‌గా తెలుసుకోవడం నా బాధ్యత. శాంతి ప్రక్రియను పునరుద్ధరించే అవకాశాల గురించి మాట్లాడుతున్నాము' అని కార్ల్ నెహమ్మర్ ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్న విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
తనతో గోల్ఫ్ ఆడాలని బైడెన్‌కు ట్రంప్ సవాల్ - గెలిస్తే మిలియన్ డాలర్లు! - US Elections 2024