Thailand New PM Paetongtarn Shinawatra : థాయ్‌లాండ్ మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవత్ర కుమార్తె పేటోంగ్టార్న్(37) నూతన ప్రధానిగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ మద్దతు చూరగొన్న పేటోంగ్టార్న్, థాయ్‌కు రెండో మహిళా ప్రధాని ఎన్నికయ్యారు. షినవత్ర కుటుంబం నుంచి మూడో ప్రధానిగా, దేశంలో అతిపిన్న మహిళా నేతగా పేటోంగ్టార్న్ రికార్డు సృష్టించారు. అయితే, అధికార పార్టీ నేతగా ఉన్న పేటోంగ్టార్న్ పార్లమెంట్‌కు ఎన్నిక కాలేదు.
ఇప్పటికీ ప్రజాదరణ ఉన్నందునే!
ప్రధాని అభ్యర్థిగా నిలబడాలంటే ఎన్నిక కావాల్సిన అవసరం లేదు. మొదట ఆమె తండ్రి తక్సిన్, తరవాత బాబాయి యింగ్లక్ షినవత్ర ప్రధాని పదవిని అధిష్ఠించారు. థాయ్ పార్లమెంటులో మెజారిటీ స్థానాలను గెలిచిన మొట్టమొదటి ప్రధాని తక్సినే. ఆయనకు ఇప్పటికీ ప్రజాదరణ ఉన్నందునే కుమార్తె పేటోంగ్టార్న్‌ను ఎన్నిక సులభమైంది. ప్రస్తుత ప్రధాని శ్రేఠ్ఠ తవిసిన్ నైతిక ప్రమాణాలను ఉల్లంఘించారని రాజ్యాంగ కోర్టు తీర్మానించడం వల్ల బుధవారం ఆయన పదవీచ్యుతుడయ్యారు.
అసలేం జరిగిందంటే?
క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్ చుయెన్‌బాన్‌ను మంత్రి వర్గంలోకి ప్రధాని స్రెట్టా తీసుకున్నారు. 2008లో ఓ కేసుకు సంబంధించి న్యాయమూర్తికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించిన పిచిత్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆయన జైలు శిక్ష పూర్తి చేసుకున్నప్పటికీ నిజాయతీ లేని వ్యక్తిగా పేర్కొంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఇటీవల రాజ్యాంగ న్యాయస్థానం ప్రస్తావించింది.
ప్రధాన మంత్రిగా తన క్యాబినెట్ సభ్యుడి అర్హతలు పరిశీలించాల్సిన పూర్తి బాధ్యత స్రెట్టాదేనని స్పష్టం చేసింది. పిచిత్ గతం గురించి తెలిసినప్పటికీ ఆయనను క్యాబినెట్‌లోకి ప్రధాని తీసుకున్నారని ఇది నైతిక ఉల్లంఘనలకు పాల్పడటమేనని పేర్కొంది. జైలుశిక్ష అనుభవించిన వ్యక్తిని క్యాబినెట్ మంత్రిగా నియమించడం ద్వారా శ్రేఠ్ఠ నైతిక నియమ భంగానికి పాల్పడ్డారని రాజ్యాంగ కోర్టు తేల్చింది. అయితే స్రెట్టా ప్రధాని పదవిలో ఏడాది కాలమే ఉన్నారు. ఆయన బదులు పేటోంగ్టార్న్ షినవత్ర నూతన ప్రధానిగా పార్లమెంటు మద్దతు చూరగొన్న ఆమె, థాయ్‌కు రెండో మహిళా ప్రధాని అవుతారు.