Papua New Guinea Landslide : పపువా న్యూ గినియాలోని కొండచరియలు విరిగిపడి 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని పోర్ట్ మోరెస్టీకి 600 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలో శుక్రవారం వేకువజామున 3గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయని ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(మీడియా) పేర్కొంది. మృతదేహాలను గ్రామస్థులు వెలికితీస్తున్నారని చెప్పింది. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్యను పపువా న్యూ గినియా అధికారులు ధ్రువీకరించలేదు. మృతుల సంఖ్య 100 కంటే ఎక్కువ ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడడం వల్ల తన కుటుంబంలోని నలుగురు మృతి చెందారని నింగా రోల్ అనే విద్యార్థి తెలిపాడు.
నిద్రలో ఉండగానే అనంత లోకాలకు
'ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కౌకలం గ్రామం మొత్తం ధ్వంసమైంది. గ్రామ సమీపంలోని పర్వతం నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.' అని పోర్గెరా ఉమెన్ ఇన్ బిజినెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ లారుమా మీడియాకు తెలిపారు.
భవనంలో మంటలు- 14 మంది మృతి
వియత్నాంలోని హనోయిలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. హనోయిలో ఓ అపార్ట్ మెంట్ భవనంలో శుక్రవారం రాత్రి జరిగిందీ దుర్ఘటన. గంటపాటు శ్రమించి అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు చెలరేగినప్పుడు భవనంలో ఎంత మంది ఉన్నారనేది ఇంకా తెలియలేదని అధికారులు చెప్పారు.
నైట్ క్లబ్ లో మంటలు- 29 మంది మృతి
తుర్కియే ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 29 మృతి చెందారు. నైట్‌క్లబ్‌లో రెనోవేషన్ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన ఎనిమిది మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మూసి ఉన్న నైట్ క్లబ్‌లో ప్రమాదం
ఈ ఘటనకు ముందు పునరుద్ధరణ పనుల కోసం నైట్‌క్లబ్‌ను మూసివేశారు. నైట్‌క్లబ్ 16 అంతస్తుల ఎత్తైన భవనంలో మొదటి అంతస్తులో ఉంది. బోస్ఫరస్ నది వల్ల బెసిక్టాస్ జిల్లా రెండు ప్రాంతాలుగా వేరైంది. ఇప్పుడు యూరోపియన్ వైపున ఉన్న బెసిక్టాస్ ప్రాంతంలో నైట్ క్లబ్ ఉన్న బిల్డింగ్ ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.