Pakistan Elections 2024 : ఆర్థిక సంక్షోభం, బాంబు పేలుళ్లు, పెచ్చుమీరుతున్న హింస, రాజకీయ కక్షలు వంటి పరిణామాల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు పాకిస్థాన్ ప్రజలు సిద్ధమయ్యారు. దేశ సైన్యం కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కొత్త కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు గురువారం ఓటేయనున్నారు. ఆర్మీ అండదండలు ఉన్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం, ఆ పార్టీకి ఉన్న ఎన్నికల గుర్తు రద్దు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి గెలిస్తే నాలుగోసారి పాక్ ప్రధానిగా ఎన్నికైన వ్యక్తిగా నవాజ్ షరీఫ్(74) రికార్డు సృష్టించినట్లవుతుంది. బ్యాటు గుర్తు కోల్పోయిన నేపథ్యంలో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. మరోవైపు, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సైతం ఎన్నికల బరిలో ఉంది.
12.85 కోట్ల ఓటర్లు
పాకిస్థాన్లో మొత్తం 12.85 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. ప్రజలు ఓటేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 90 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సాగనుంది. ఎన్నికల నేపథ్యంలో గురువారం దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. భద్రత కోసం 6.50 లక్షల మంది సిబ్బందిని రంగంలోకి దించారు. బుధవారం బాంబు దాడులు జరిగిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది.
గెలిచిన వారికి సవాళ్ల స్వాగతం
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)లో మొత్తం 366 స్థానాలు ఉండగా 266 సీట్లకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానాల కోసం మొత్తం 5,121 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే సమయంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం గురువారమే ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 749 స్థానాలు ఉండగా 593 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి 12,695 మంది పోటీ చేస్తున్నారు.
ఎన్నికల్లో గెలిచిన పార్టీకి అనేక సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. సంక్షోభంలో ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రోజురోజుకూ క్షీణిస్తున్న శాంతిభద్రతల సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది.
పాక్ ఎన్నికల బరిలో ముంబయి ఉగ్రదాడి సూత్రధారి!- కొత్త పార్టీ ప్రకటన