Trump On Debate With Harris : అమెరికా ఎన్నికల్లో భాగంగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఇటీవల తొలిసారి డిబేట్‌లో తలపడ్డగా, కమలదే పైచేయి అని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమలా హారిస్‌తో తాను మరోసారి చర్చకు సిద్ధంగా లేనని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మంగళవారం రాత్రి డెమోక్రాట్ల రాడికల్ లెఫ్ట్ అభ్యర్థి కమలా హారిస్‌తో జరిగిన డిబేట్‌లో తానే గెలిచానని ట్రంప్ తెలిపారు. కానీ సర్వేలు మాత్రం భిన్నంగా చూపిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పరాజితురాలు హారిస్‌తో మరోసారి చర్చకు తాను సిద్ధంగా లేనని ట్రంప్ పేర్కొన్నారు. తాను మూడో చర్చకు సిద్ధంగా లేనని ఆయన పేర్కొన్నారు. అధ్యక్ష రేసులోంచి బైడెన్ వైదొలగకముందు ట్రంప్, బైడెన్‌ల మధ్య తొలి డిబేట్ జరిగింది. తాజాగా ట్రంప్, హారిస్‌ల మధ్య రెండో డిబేట్ జరిగింది. దీంతో ఆయన మూడో డిబేట్‌కు సిద్ధంగా లేనని ప్రకటించారు.
నవంబరు 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష రేసులో నిలబడుతున్న ట్రంప్, కమలా హారిస్‌లు పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన తొలి సంవాదంలో పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌దే విజయమని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. హారిస్‌పై తనదే పైచేయిగా ట్రంప్ చేస్తున్న వాదనలను సైతం తోసిపుచ్చాయి. ఈ చర్చ జరిగిన 24 గంటల్లోనే హారిస్‌కు 47 మిలియన్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.394కోట్లు) విరాళాలు సమకూరినట్లు పేర్కొన్నాయి. అక్టోబరు 1న న్యూయార్క్‌లో ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వాన్స్, డెమోక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ టీమ్ వాజ్‌ల మధ్య చర్చ జరగనుంది.
ట్రంప్‌పై ఉన్న రెండు నేరాభియోగాలు కొట్టివేత
మరోవైపు, ట్రంప్‌పై ఉన్న రెండు నేరాభియోగాలను కోర్టు కొట్టివేసింది. 2020 ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకొన్న కేసులో ట్రంప్‌నకు ప్రమేయం ఉందనే అభియోగాల్లోని రెండు కౌంటీలను జార్జియాకు చెందిన ఫాల్టన్ కౌంటీ న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇక, ట్రంప్‌పై ఉన్న ఎనిమిది ఆరోపణలతో పాటు మిగిలిన కేసుల విచారణకు అనుమతించారు. ఈ తీర్పుపై ట్రంప్ న్యాయవాది స్పందిచారు. మరోసారి విజయం సాధించామన్నారు.