Mexico Bus Accident : మెక్సికోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలోల 19 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. బస్సు, ట్రక్కు ఢీకొనడం వల్ల మంగళవారం జరిగిందీ దుర్ఘటన. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పసిఫిక్ తీర రాష్ట్రం సినాలోవాలోని జాతీయ రహదారిపై సరుకులను రవాణా చేసే ట్రక్కు, బస్సు ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు.
పీటీఐ ర్యాలీలో బాంబు దాడి
Pakistan Bomb Blast : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ర్యాలీలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో 5 మంది గాయపడ్డారు. ఈ దాడి బలూచిస్థాన్‌లో మంగళవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మంగళవారం పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. సిబీ నగంలోని జిన్నా రోడ్డులోకి వచ్చాక ఈ పేలుడు సంభవించిదని పీటీఐ ఎక్స్ వేదికగా తెలిపింది. 'ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కార్యకర్తలకు బదులుగా ఉగ్రవాదులను అణిచివేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టి దోషులను శిక్షించాలి.' అని పీటీఐ పేర్కొంది. ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలకు ముందు పేలుడు సంభవించడంపై నోటీసులు తీసుకున్నట్లు పాకిస్థాన్ ఎన్నికల సంఘం తెలిపింది. బలూచిస్థాన్ చీఫ్ సెక్రటరీ నుంచి తక్షణ నివేదికను కోరామని పేర్కొంది.
మరోవైపు సోమవారం రాత్రి బలూచిస్థాన్‌లో అత్యంత భద్రతలో ఉండే జైలులో తీవ్రవాదులు రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడిలో ఐదుగురు తీవ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఎన్నికల పార్టీ ర్యాలీలో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.