Lancet Study On Obesity : భారత్‌లో ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 2022 నాటికి దేశంలో 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల కోటీ 25 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు 'ది లాన్సెట్' జర్నల్ తెలిపింది. ఇందులో 70 లక్షలకు పైగా అబ్బాయిలు, 50 లక్షలకు పైగా అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించింది. భారత్‌లో 1990లో 1.2 శాతంగా ఉన్న ఒబెసిటీ రేటు 2022కు 9.8 శాతానికి చేరింది. 2022 వరకు 4 కోట్ల 40 లక్షల మంది మహిళలు, 2 కోట్ల 60 లక్షల మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నట్లు లాన్సెట్ పేర్కొంది.
ప్రతి 8 మందిలో ఒకరు
ప్రపంచవ్యాప్తంగా 1990లో 195 మిలియన్ల మంది ఒబెసిటీ బాధితులు ఉంటే 2022కు ఆ సంఖ్య ఒక బిలియన్ (100 కోట్లు) దాటినట్లు వివరించింది. ఇందులో 88 కోట్ల మంది పెద్దవారు, 15 కోట్ల 90 లక్షల మంది పిల్లలు, యుక్తవయస్సుగల వారు ఉన్నారని స్పష్టం చేసింది. అంటే ప్రతి 8 మందిలో ఒకరు ఒబెసిటీతో పోరాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత 30 ఏళ్లలో పోషకాహార లోపంతో బాధపడుతూ తక్కువ బరువు ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ ఊబకాయుల సంఖ్య పెరగడానికి కారణం అధిక పోషకాహారం తీసుకోవడమే కాకుండా పోషకాహార లోపం కూడా కారణమని లాన్సెట్ పేర్కొంది.
మరోవైపు మాల్ న్యూట్రిషన్‌తో
ఒక వైపు ఊబకాయుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నా ఇంకా చాలా పేద దేశాల్లో మాల్ న్యూట్రిషన్‌తో తక్కువ బరువు ఉన్నవారు చాలామందే ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. 2022 వరకు 18 కోట్ల 30 లక్షల మంది మహిళలు, 16 కోట్ల 40 లక్షల మంది పురుషులు తక్కువ బరువుతో బాధపడుతున్నారని లాన్సెట్ నివేదించింది. ఊబకాయంపై ప్రపంచ దేశాలు ఇప్పుడే మేల్కొని చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ గతంలోనే హెచ్చరించింది.
బియర్డ్ ఆయిల్ Vs బియర్డ్ బామ్- స్టైలిష్ లుక్ కోసం ఏది బెటర్ ?
చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? ఈ తైలం అప్లై చేస్తే సమస్యకు చెక్!