Kamala Harris President Nominee : ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. పార్టీ కూడా ఆమె వైపే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ తమ మద్దుతును ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కమలా హారిస్‌తో పాటు పలువురు పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దీంతో కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది.
కమలా హారిస్‌కు జో బైడెన్ స్వయంగా మద్దతు ప్రకటించగా ఒబామా మాత్రం ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. కానీ, బైడెన్ రేసు నుంచి తప్పుకోవడాన్ని ప్రశంసించారు. మరోవైపు రానున్న రోజుల్లో ఉహించని పరిణామాలు ఎదురకానున్నాయని అన్నారు. కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ నాయకులు సరైన ప్రక్రియతో ముందుకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒబామాను హారిస్‌కు మెంటార్‌గా చెబుతుంటారు. అలాంటిది ఆయనే మద్దతు తెలకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో కీలక నేత నాన్సీ పెలోసీ సైతం కమలా హారిస్‌కు ఇంతవరకు మద్దతు ప్రకటించకపోవడం గమనార్హం.
హారిస్‌కు మద్దతుగా భారత సంతతి ప్రతినిధులు
ఇప్పటివరకు హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ మద్దతు ప్రకటించారు. ప్రతినిధుల సభలో ఉన్న భారత సంతతికి చెందిన డెమొక్రటిక్ నేతలు ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, శ్రీ థానేదార్, అమి బెరాతో పాటు అశ్విన్ రామస్వామి సైతం కమలా హారిస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే బైడెన్ అంగీకరించగానే హారిస్ అభ్యర్థి కాలేరు. 4,700 మంది ప్రతినిధులు అభ్యర్థిని ఆమోదించాల్సి ఉంటుంది. వారితో పాటు సూపర్ డెలిగేట్లు, మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతు హారిస్‌కు ఉండాల్సి ఉంటుంది. డెమొక్రటిక్ అభ్యర్థిని ఆగస్టు నెలలో జరిగే పార్టీ సదస్సులోనే నిర్ణయిస్తారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినోయీ గవర్నర్ జేబీ ఫ్రిట్జ్‌కెర్ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్నారు.
బైడెన్‌పై ప్రశంసలు
అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ వైదొలగాలన్న జో బైడెన్ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలతో స్వాగతిస్తున్నారు. రెండోసారి పోటీ చేసేందుకు బైడెన్‌కు అర్హతలు ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దేశంపై ఆయనకు ఉన్న ప్రేమను చాటుతోందని ఒబామా అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారన్నారు.
అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్ - బరిలోకి కమలా హారిస్! - Biden Drops Out