Kamala Harris Leads Trump In Various Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్ దూసుకెళ్తున్నారు. అరిజోనా, మిషిగన్, పెన్సిల్వేనియా వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. 'యూమాస్ లోవెల్స్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ యుగవ్' సంస్థ విడుదల చేసిన పోల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ట్రంప్‌పై కమల ఆధిక్యంలో ఉన్నట్లు ఈ సర్వే సంస్థ తెలిపింది.
'యూమాస్ లోవెల్స్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ యుగవ్' పోల్ ప్రకారం
మిషిగన్ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు 43 శాతం, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు 48 శాతం మద్దతు ఉన్నట్లు తాజా పోల్ సర్వేలో తేలింది. పెన్సిల్వేనియాలో ట్రంప్‌నకు 46 శాతం, హారిస్‌కు 48 శాతం మంది అండగా ఉన్నారు. అలాగే అరిజోనాలోనూ ట్రంప్‌పై కమల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
"అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం సాధించాలంటే గ్రేట్ లేక్స్ స్టేట్స్లో రాణించాలి. మిషిగన్‌లో ట్రంప్‌పై ప్రతికూలత ఉంది. ఈ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు సాధించాలంటే దాన్ని అధిగమించాలి. పెన్సిల్వేనియాలో కూడా ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగానే ఉంది. రాబోయే వారాలు ఇరువురు అభ్యర్థులకు చాలా కీలకం" అని యూమాస్ లోవెల్స్ పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అసోసియేట్ డైరెక్టర్ రోడ్రిగో కాస్ట్రో కార్నెజో అభిప్రాయపడ్డారు.
జార్జియాలో కమల, అరిజోనాలో ట్రంప్ దూకుడు
ఫాక్స్ న్యూస్ చేసిన సర్వే ప్రకారం, జార్జియాలో ట్రంప్‌పై కమల ఆధిక్యంలో ఉన్నారు. జార్జియాలో ట్రంప్‌నకు 48 శాతం ఓట్లు రాగా, హారిస్‌కు ఏకంగా 51 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే అరిజోనా రాష్ట్రంలో మాత్రం కమలపై ట్రంప్ పైచేయి సాధించారు. అక్కడ కమలకు 48 శాతం మద్దతు ఉండగా, ట్రంప్‌నకు 51 శాతం మంది జైకొట్టారు. ఈ క్రమంలో అన్ని సర్వేలను క్రోడీకరించి చూస్తే డెమొక్రటిక్ అభ్యర్థి కమల హారిస్ కన్నా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెనుకబడ్డారు. దాదాపు రెండు శాతం ఓట్లతో కమల పైచేయి సాధించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికీ సమానంగానే మద్దతు ఉంది.
గడియారాల వ్యాపారంలోకి ట్రంప్
ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చేస్తూ, మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. 'అఫీషియల్ ట్రంప్ వాచ్ కలెక్షన్' పేరిట వజ్రాలు పొదిగిన గడియారాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఈ బిజినెస్‌ను ట్రంప్ గురువారం ప్రారంభించారు. 122 డైమండ్లు పొదిగిన, 18 క్యారెట్ల గోల్డ్ స్టైల్ వాచీ ధర 1,00,000 అమెరికా డాలర్లు. అంటే భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.83 లక్షలు ఉంటుంది.
గతంలో బైబిల్స్, స్నీకర్స్, ఫొటో బుక్స్, క్రిప్టో కరెన్సీ వంటి వ్యాపారాలను డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. తాజాగా ఖరీదైన డైమండ్లు పొదిగిన వాచీల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే అధ్యక్ష ఎన్నికలకు 40 రోజుల ముందు ట్రంప్ వ్యాపారం ప్రారంభించడంపై విమర్శలు వస్తున్నాయి.
'ఈసారి ఓడిపోతే మళ్లీ పోటీ చేయను' - డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన - Trump 2024 Last Run Statement