Israeli Strike In Gaza : సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 25మంది పాలస్తీనియన్లు మృతి చెందారని పాలస్తీనా వైద్యులు తెలిపారు. 40మందికి పైగా క్షతగాత్రులు అల్-అవ్దా, అల్-అక్సా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అందులో ఎక్కువ మంది పిల్లలేలని పేర్కొన్నారు. గురువారం ఇజ్రాయెల్, గాజాలోని నుసిరత్ శరణార్థి క్యాంపులోని ఓ భవనంపై దాడి చేసిందని, అక్కడి నుంచి తమ వద్దకు 25మృదేహాలు వచ్చాయని అల్-అవ్దా, అల్-అక్సా ఆస్పత్రి వైదులు తెలిపారు. గాజాలో యుద్ధాన్ని ముగించడానికి కాల్పుల విరమణ ఒప్పందం గురించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వ్యాఖ్యానించిన గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం.
మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 20మందికి పైగా మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది ఉండటం గమనార్హం.
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడం వల్ల దాదాపు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని మిలిటెంట్ సంస్థ బందీలుగా తీసుకెళ్లింది. దాంతో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది. టెల్‌అవీవ్ దాడులతో ఇప్పటివరకు 44వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అందులో సగానికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నారని పేర్కొంది. అయితే అందులో ఎంతమంది మిలిటెంట్లు ఉన్నారన్న విషయం చెప్పలేదు. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ లెక్కల ప్రకారం 17,000 మిలిటెంట్లను హతమార్చినట్లు తెలిపింది. కానీ అందుకు సంబంధించిన ఆధారాలను చూపించలేదు.
అయితే ఇజ్రాయెల్ చేస్తున్న వరుస దాడులు గాజాను తీవ్ర మానవతా సంక్షోభంలోకి నెట్టాయి. అక్కడ కరవు తాండవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, గాజాలోకి కావాల్సినంత మానవతా సహాయాన్ని అనుమతించామని, కానీ వాటిని బాధితులకు సరఫరా చేయడంలో ఐరాస ఏజెన్సీలు విఫలమయ్యాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.