Israel Gaza War Conflict : లెబనాన్‌పై భీకరదాడులు జరుపుతున్న ఇజ్రాయెల్, గాజాపైనా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. జబాలియా శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్ నాలుగో రోజూ భీకర దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు గాజా అధికారులు తెలిపారు. వేలాది మంది ఇళ్లలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. గత మూడు రోజుల్లో 54 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసినట్లు చెప్పారు. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సెంట్రల్ గాజాలోని శరణార్థి శిబిరంలో ఉన్న పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 28 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది. మరో 54 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఉత్తర గాజాలో సుమారు 4 లక్షల మంది భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడిన వేలాదిమందితో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో సిబ్బంది, మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నట్లు ఐరాస తెలిపింది. నిరాశ్రయులైన మహిళలు, చిన్నారులు ఆస్పత్రుల్లోనే ఆశ్రయం పొందుతున్నట్లు ఐరాస తెలిపింది.
అటు దక్షిణ లెబనాన్‌లోని దర్ద్‌ఘయా పట్టణంపై బుధవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. స్థానికంగా ఉన్న సివిల్ డిఫెన్స్ సెంటర్‌పై జరిగిన దాడిలో ఐదుగురు వైద్య సిబ్బంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హెజ్‌బొల్లా కూడా ప్రతిదాడులు చేసింది. గంటల వ్యవధిలో సుమారు 40 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్ పై దాడి చేసింది. వాటిలో కొన్నింటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ నేలకూల్చగా మరికొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో పడినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
ఇజ్రాయెల్ సైనికులు దక్షిణ లెబనాన్‌లోని ఓ గ్రామంలో తమ దేశం జెండా ఎగురవేసినట్లు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ముగ్గురు సైనికులు శిథిలాలపై ఇజ్రాయెల్ జాతీయ జెండాను ఎగురవేస్తున్నట్లు ఆ దృశ్యాల్లో ఉంది. గాజాలో భూతల దాడులు చేసిన సమయంలో కూడా ఇలాంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.