Israel Attack On Gaza : గాజాలో మరోసారి మారణహోమం జరిగింది. సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 67 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభంలోనే ఈ ఘటన జరగడం విషాదం నెలకొంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన పాలస్తీనీయన్ల సంఖ్య 31,112కు పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నారు. గత 5 నెలలుగా జరుగుతున్న యుద్ధం వల్ల గాజాలోని 2.3 మిలియన్ల మంది ప్రజలలో 80 శాతం మంది ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. వేలాది మంది ఆహారం, పానీయాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు.
బైడెన్ ఆలోచన తప్పు: నెతన్యాహు
హమాస్‌తో పోరు విషయంలో జో బైడెన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పుపట్టారు. 'నేను మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని, దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బైడెన్ భావిస్తే అది పూర్తిగా తప్పు' అని వ్యాఖ్యానించారు. గాజాలో మృతుల సంఖ్య గురించి నెతన్యూహును ప్రశ్నించగా 'అది నాకెలా తెలుస్తుంది. మా సైనికులు 13 వేలమంది మిలిటెంట్లను హతమార్చారు' అని తెలిపారు. దాదాపు 1.3 మిలియన్ల పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్నీ ఇజ్రాయెల్ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంజమిన్ వైఖరి సొంత దేశాన్నే గాయపరుస్తోందని ఆక్షేపించారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన బైడెన్
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ సాధించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు.
నెతన్యాహుతో అజిత్ డొభాల్ భేటీ - యుద్ధంపై చర్చ
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సోమవారం భేటీ అయ్యారు. హమాస్‌తో జరుగుతున్న యుద్ధం గురించి, బందీల విడుదల, మానవతా సాయం అందజేత లాంటి అంశాల గురించి ఇరువురూ చర్చించారు. డొభాల్‌తో భేటీ, చర్చించిన అంశాలను నెతన్యాహు కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఆస్కార్ వేడుకలకు 'గాజా' నిరసనల సెగ- ఆలస్యంగా వచ్చిన ప్రముఖులు
'ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడిని అడ్డుకోవడంలో మోదీదే ముఖ్యపాత్ర!'