Israel Attack On Damascus : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయ కాన్సులర్ విభాగంపై ఇజ్రాయెల్ సోమవారం వైమానిక దాడి చేసింది (Syria Attack). ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన ఇద్దరు జనరల్స్, ఐదుగురు అధికారులు మృతి చెందారని సిరియా అధికారులు, ఇరాన్ సైన్యం తెలిపాయి.
Israel Attack In Syria : ఈ దాడిలో కుప్పకూలిన కాన్సులర్ భవనం పక్కనే రాయబార కార్యాలయం ఉంది. ఈ ఘటనలో చనిపోయిన ఇరాన్ మిలిటరీ సలహాదారు జనరల్ అలీ రెజా జెహ్‌దీ 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో ఇరాన్ ఖుద్స్ బలగాలకు నేతృత్వం వహించారు. గత అక్టోబర్ 7న జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో మృతదేహాల కోసం రెస్క్యూ దళాలు అన్వేషిస్తున్నాయి.
అయితే ఇలాంటి దాడులను చాలా అరదుగా అంగీకరించే ఇజ్రాయెల్ తాజా దాడిపైనా ఇంకా స్పందించలేదు. ఈ ఘటనను సిరియాలోని ఇరాన్ రాయబారి హొస్సేన్ అక్బరీ ఖండించారు. దాడిలో ఏడుగురు చనిపోయినట్లు ఆయన తెలిపారు. భవనానికి కాపాలాగా ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది సైతం గాయపడినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి ఎదుర్కోక తప్పదని, ఇదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ ఘటనను ప్రపంచమంతా ఖండించాలని ఇరాన్ విదేశాంగ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-గాజాల మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ సహా దాని మిత్రదేశాలు సహాయం చేస్తున్నాయని ఇజ్రాయెల్ ఎప్పట్నుంచో ఆరోపిస్తూ వస్తుంది. ఇందులో సిరియా కూడా ఉంది. అందువల్ల ప్రతీకార చర్యల్లో భాగంగానే సిరియాలోని ఇరాన్‌కు చెందిన కార్యాలయంపై ఇజ్రాయెల్ ఈ తాజా వైమానిక దాడికి దిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గాజా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన ఇజ్రాయెల్ సైన్యం
గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి నుంచి ఇజ్రాయెల్ సైన్యం సోమవారం వైదొలగింది. రెండు వారాలపాటు దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ మొత్తం 200 మంది ఉగ్రవాదులను హతమార్చి, కొన్ని వందలమందిని నిర్బంధించినట్లు ప్రకటించింది. ఆరు నెలల యుద్ధంలో ఇదొక భారీ విజయమని అభివర్ణించింది. పెద్దఎత్తున విధ్వంసాన్ని ఇజ్రాయెల్ దళాలు మిగిల్చాయని, అనేక మృతదేహాలు అక్కడే పడి ఉన్నాయని పాలస్తీనా వాసులు చెబుతున్నారు. గాజాలో పెద్దఎత్తున బందీలుగా ఉన్నవారిని ఇళ్లకు తీసుకువచ్చేందుకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరిన్ని చర్యలు చేపట్టాలంటూ ఇజ్రాయెల్‌లో భారీగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నవేళ ఈ పరిణామం జరిగింది. ఇక ఇజ్రాయెల్‌లో అల్‌జజీరా ఛానల్ ప్రసారం కాకుండా చేస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. దీనిని ఉగ్రఛానల్‌గా ఆయన అభివర్ణించారు. ఛానల్‌పై చర్యకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.