Israel Attack On Iran : తమ దేశంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ శనివారం టెహ్రాన్‌పై విరుచుకుపడింది. అయితే ఈ దాడిలో తమ వైమానిక దళానికి చెందిన నలుగురు చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ శనివారం రాత్రి వివరాలు వెల్లడించింది.
ఇరాన్ చేసిన క్షిపణి దాడులతో ప్రతీకారాగ్నితో రగిలిపోతున్న ఇజ్రాయెళ్, టెహ్రాన్‌లోని దాదాపు 20 లక్ష్యాలపై శనివారం తెల్లవారుజామున దాడులకు పాల్పడింది. దాదాపు 100 యుద్ధ విమానాలను ప్రయోగించి బాంబులు జారవిడిచింది. ఇరాన్‌కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో దక్షిణ టెహ్రాన్‌లోని ఓ డ్రోన్ ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే, ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల కారణంగా తమకు నష్టం స్వల్ప స్థాయిలోనే ఉందని ఇరాన్ వెల్లడించింది.
ఇరాన్‌పై ప్రతీకార దాడులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించింది. ఈ ఘర్షణల కారణంగా ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా కాకుండా సంయమనం పాటించాల్సిన అసవరం ఉందని సూచించింది. అయితే, తమ ప్రకటనలో ఇజ్రాయెల్ పేరును ఈ అరబ్ దేశం పేర్కొనలేదు. సౌదీ అరేబియా కూడా ఇదే విధంగా తమ ఆందోళనను వ్యక్తం చేసింది.
ఇటీవల ఇరాన్ భారీ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. వీటిల్లో కొన్ని లక్ష్యాలకు అత్యంత సమీపంలో పడ్డాయి. మిగిలిన వాటిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గాల్లోనే అడ్డుకున్నాయి. దీనికి ప్రతీకార చర్య తప్పదని ఇజ్రాయెల్ చెప్పింది. అన్నట్టుగానే తాజాగా ఆ దిశగా దాడులకు దిగింది. అదే సమయంలో ఇరాన్ మరోసారి దాడులు చేస్తే, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు చేసింది.
ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ స్పందించకూడదని, ఉద్రిక్తత వాతావరణానికి ముగింపు పలకాలని ప్రపంచంలోని పలు దేశాలు విజ్ఞప్తిచేశాయి. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కోరారు. ప్రతిదాడులకు పాల్పడవద్దని అమెరికా కూడా ఇరాన్‌కు హితవు పలికింది. హింసను విడనాడాలని రష్యా ఇరుపక్షాలకు సూచించింది. ఈ ఘర్షణను ఇంతటితో ముగించాలని, పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరించాలని పేర్కొన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు భారత్ విజ్ఞప్తి చేసింది. సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్టు, యెమెన్ మాత్రం ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని, అంతర్జాతీయ చట్టాలకిది విరుద్ధమని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌లో ప్రతిపక్ష నేత యాయిర్ లపిడ్ నెతన్యాహుపై ధ్వజమెత్తారు. ఇరాన్‌లోని వ్యూహాత్మక, ఆర్థిక లక్ష్యాలపై దాడి చేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఇరాన్ నుంచి భారీ మూల్యాన్ని వసూలు చేయలేదని ఆక్షేపించారు.