Iran President Helicopter Crash :హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ఆదివారం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. ఆయనతో పాటు పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్‌మతీ తదితరులు కన్నుమూసినట్టు ప్రకటించింది.
ఇదీ జరిగింది
ఇరాన్-అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను ఇరు దేశాలు కలిసి నిర్మించాయి. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం విదేశాంగ మంత్రి హోస్సేన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్‌లో రైసీ ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లు కూడా వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ, ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.
ఈ ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్‌కు వాయవ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం ఘటన జరిగిన కచ్చితమైన ప్రదేశాన్ని 'ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ' గుర్తించింది. ఆ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడి మరణవార్తను ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. హెలికాప్టర్ శకలాల దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది.
'ఇరాన్ ప్రజలకు అండగా ఉంటాం'
హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'భారత్-ఇరాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా ఉంటాం' అని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. అలాగే పలువురు దేశాధినేతలు కూడా రైసీ మృతిపై సంఘీభావం తెలిపారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా విచారం వ్యక్తం చేసింది.
-
Deeply saddened and shocked by the tragic demise of Dr. Seyed Ebrahim Raisi, President of the Islamic Republic of Iran. His contribution to strengthening India-Iran bilateral relationship will always be remembered. My heartfelt condolences to his family and the people of Iran.…
— Narendra Modi (@narendramodi) May 20, 2024
ప్రమాదంపై అనుమానాలు
రైసీ 2017లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి హసన్ రౌహానీ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. రెండో ప్రయత్నంలో 2021లో దేశాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ రైసీని చూస్తుంటారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టిపరిస్థితుల్లోనూ విడనాడడని ఆయనకు పేరుంది. కాగా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత హెలికాప్టర్ ప్రమాదం జరగడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.