Iran Attack On Israel : ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేయనుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్ అవీవ్‌పై విరుచుకుపడేందుకు టెహ్రాన్ సిద్ధమైందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
పౌరులకు దేశాల హెచ్చరికలు!
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా, బ్రిటన్, భారత్, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్‌లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. కుటుంబాలతో సహా ఫ్రెంచ్ దౌత్యవేత్తలు తక్షణం టెహ్రాన్‌ను వీడాలని ఫ్రాన్స్ ఆదేశించింది. భారత పౌరులెవ్వరూ ఇజ్రాయెల్, ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. శనివారం వరకు టెహ్రాన్‌కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ గడువును గురువారానికి పొడిగించింది.
రెండు వారాల క్రితం సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఆ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన టాప్ కమాండర్లు సహా ఏడుగురు సైనికులు మరణించారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయల్‌పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది. ఇదిలాఉంటే ఇజ్రాయెల్‌పై దాడికి సంబంధించి ఇరాన్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్‌కు అమెరికా ఫుల్ సపోర్ట్!
మరోవైపు ఇరాన్‌ను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షిపణి విధ్వంసక యుద్ధనౌకలను ఇజ్రాయెల్‌కు సమీపంలోకి అగ్రరాజ్యం పంపింది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో టెల్ అవీవ్ చేరుకున్న అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లా శుక్రవారం ఇజ్రాయెల్ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఆ దేశ రక్షణ మంత్రి యోయావ్ గాలాంట్‌తో కలిసి హెట్జోర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు.
'మేం సహకరించం'
ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే తాము ఎట్టిపరిస్థితుల్లో సహకరించేది లేదని పలు అరబ్ దేశాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఖతార్, కువైట్ దేశాలు ఈ విషయాన్ని కరాఖండిగా అగ్రరాజ్యానికి తేల్చి చెప్పేశాయి. ఇరాన్‌పై దాడికి తమ దేశ గగనతలాన్ని గానీ, స్థావరాలను గానీ ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశాయి. సౌదీ అరేబియా సహా మిగతా అరబ్ దేశాలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది.
ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- ఏడుగురు అధికారులు మృతి! - Israel Attack On Damascus