India Canada Amit Shah Issue : కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదులపై హింసాయుత దాడులు చేయాలని భారత హోంమంత్రి అమిత్‌షా ఆదేశించారన్న కెనడా మంత్రి ఆరోపణలు అసంబద్ధమైనవి, నిరాధారమైనవని భారత్ శనివారం స్పష్టం చేసింది. కెనడా హైకమిషన్ ప్రతినిధిని దిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కెనడా ప్రభుత్వ అధికారులు ఉద్దేశపూర్వకంగా భారత దేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, ఇతర దేశాలను ప్రభావితం చేసేందుకు అంతర్జాతీయ మీడియాకు నిరాధార లీకులు విడుదల చేశారని తప్పుబట్టింది. అలాంటి బాధ్యతారాహిత్య చర్యల వల్ల రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని హితవు పలికింది.
"భారత హోంమంత్రి అమిత్‌షాపై నిరాధార ఆరోపణలు చేసిన వ్యవహారంలో కెనడా అధికారికి సమన్లు జారీ చేశాం. ఇటీవల అట్టావాలో పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన స్టాండింగ్ కమిటీ ముందు భారత హోంమంత్రిపై కెనడా డిప్యూటీ మంత్రి డేవిడ్ మోరిసన్ నిరాధార ఆరోపణలు చేశారు. దానిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాం. అలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన ఇరుదేశాల దౌత్యపరమైన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించాం"
- రణధీర్ జైశ్వాల్, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి
VIDEO | " we had summoned the representative of the canadian high commission yesterday, a diplomatic note was handed over in reference to the proceedings of the standing committee on public safety and national security in ottawa on october 29, 2024. it was conveyed in the note… pic.twitter.com/ui1lv5sOcE
— Press Trust of India (@PTI_News) November 2, 2024
మంగళవారం కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్- జాతీయ భద్రతపై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఖలిస్థానీ వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకుని హింస, బెదిరింపులకు పాల్పడడం సహా గూఢచర్యం చేసి, విషయ సేకరణ చేయాలని భారత హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆదేశించారని పేర్కొన్నారు.
ఆంక్షలు!
రష్యా సైనిక, పారిశ్రామిక స్థావరాలకు సాయం చేస్తున్నారనే ఆరోపణలతో పలువురు వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇందులో భారత్‌కు చెందిన 19 కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. వ్యూహాత్మక వాణిజ్యం విషయంలో భారతదేశానికి బలమైన, చట్టపరమైన, నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఉందని పేర్కొంది.
లద్ధాఖ్‌లో పెట్రోలింగ్ స్టార్ట్
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాలు సాధారణ పెట్రోలింగ్‌ను పునఃప్రారంభించాయని విదేశాంగ శాఖ తెలిపింది. భారత సైన్యం శనివారం నుంచి దమ్చోక్ వద్ద పెట్రోలింగ్ మొదలుపెట్టింది. శుక్రవారం దెప్సాంగ్‌లో భారత సైన్యం పెట్రోలింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2020లో తలెత్తిన సైనికుల ప్రత్యక్ష ఘర్షణ కారణంగా 4 ఏళ్లుగా పెట్రోలింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే రెండు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం గురువారం బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాలు మళ్లీ పెట్రోలింగ్ ప్రారంభించాయి.