PM Modi Speaks With Netanyahu : ఇజ్రాయెల్ - హెజ్‌బొల్లా యుద్ధంతో కొంతకాలంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కొంతకాలంగా లెబనాన్‌లో వరుస దాడులు చేపట్టి హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా సహా కీలక కమాండర్లను హతమార్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలో ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
'పశ్చిమాసియాలో ఇటీవల కాలంగా జరిగిన పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడాను. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. స్థానికంగా ఉద్రిక్తతలు తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకుని బందీలందరిని సురక్షితంగా విడుదల చేయడం చాలా ముఖ్యం. వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వాల పునరుద్ధరణ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయానికి భారత్ కట్టుబడి ఉంది' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Spoke to Prime Minister @netanyahu about recent developments in West Asia. Terrorism has no place in our world. It is crucial to prevent regional escalation and ensure the safe release of all hostages. India is committed to supporting efforts for an early restoration of peace and…
— Narendra Modi (@narendramodi) September 30, 2024
కేబినెట్‌లో మాజీ ప్రత్యర్థి
హెజ్‌బొల్లాతో యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో తన మాజీ ప్రత్యర్థి గిడియన్ సార్‌కు చోటు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని విస్తరిస్తూ గిడియన్‌ను మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేకపోయినా గిడియాన్‌ను సెక్యూరిటీ కేబినెట్‌లో కొనసాగేలా నెతన్యాహుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారు ప్రత్యర్థులైనప్పటికీ దేశ హితం కోసమే కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. హమాస్, హెజ్‌బొల్లా యుద్ధంలో ఈ సెక్యూరిటీ కేబినెట్ కీలక పాత్ర పోషిస్తుంది. హెజ్‌బొల్లాతో యుద్ధం నేపథ్యంలో రాజకీయంగా, సైన్యంలోకి అల్ట్రా- ఆర్థోడాక్స్ వ్యక్తులను తీసుకోవడం, బడ్జెట్‌ను రూపొందించడం వంటి విషయాల్లో గిడియాన్ నెతన్యాహుకు సహాయం చేస్తారని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యర్థులైనా లక్ష్యం అదే!
నెతన్యాహు- గిడియాన్ ప్రత్యర్థులే అయినప్పటికీ వీరిద్దరూ పాలస్తీనా రాజ్య స్థాపనకు వ్యతిరేకం. అంతేకాకుండా ఇజ్రాయెల్ శత్రువులను ఎలాగైనా అంతం చేయాలనే భావజాలంతో ఉంటారు. కాగా, హమాస్‌ను పూర్తిగా నాశనం చేసేవరకు ఇజ్రాయెల్ పోరాటం ఆపకూడదని రీసెంట్గా గిడియాన్ ఓ సందర్భంలో అన్నారు. అలాగే హెజ్‌బొల్లాకు మద్దతిస్తున్న ఇరాన్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.