India Pledges 40 million Cancer Vaccine Doses For Indo-Pacific Nations : ఇండో-పసిఫిక్ దేశాలకు 40 మిలియన్ల వాక్సిన్ డోసులు అందించి క్యాన్సర్‌తో పోరాటానికి సాయం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని మోదీ శనివారం అమెరికాకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ నిర్వహించిన క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఇండో- పసిఫిక్ దేశాలకు 40 మిలియన్ల క్యాన్సర్ వ్యాక్సిన్ డోస్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల జీవితాల్లో ఆశాకిరణం
"40 మిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో ఆశాకిరణంగా మారతాయి. ఒక దేశం, ఒక ఆరోగ్యం అనేది భారత్ లక్ష్యం. అందుకే మూన్‌షాట్ చొరవ కింద 7.5 మిలియన్ డాలర్ల విలువైన నమూనా కిట్‌లు, డిటెక్షన్ కిట్‌లతో పాటు క్యాన్సర్ వ్యాక్సిన్‌లను ఇండో-పసిఫిక్ దేశాలకు అందిస్తాం. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలనే మా భాగస్వామ్య సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. కొవిడ్ మహమ్మారి సమయంలో ఇండో- పసిఫిక్ దేశాలకు భారత్ నుంచి వ్యాక్సిన్‌లను అందించాం. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. క్వాడ్‌లో గర్భాశయ క్యాన్సర్ వంటి సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవాలని మేము నిర్ణయించాం. ఇందుకు అన్ని దేశాల మద్దతు ఎంతో అవసరం" అని మోదీ పేర్కొన్నారు.
గర్భాశయ క్యాన్సర్‌తో మరణాలు
"ప్రతి సంవత్సరం ఇండో- పసిఫిక్ ప్రాంతంలో గర్భాశయ క్యాన్సర్‌తో దాదాపు 1,50,000 మంది మహిళలు మరణిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నేతలు, అనేక సంస్థలు హెచ్‌పీబీ స్క్రీనింగ్, థెరప్యూటిక్స్‌కు 150 మిలియన్ల డాలర్లకు పైగా వెచ్చిస్తున్నారు. వచ్చే ఏడాది యూఎస్ నేవీకి చెందిన వైద్యులు, నర్సులు ఇండో- పసిఫిక్ సహచరులకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ నిర్వహించడంలో శిక్షణ ఇస్తారు" అని బైడెన్ వెల్లడించారు. క్యాన్సర్ మూన్‌షాట్ కార్యక్రమంలో పలు దేశాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ప్రాణాలు తీసే క్యాన్సర్‌ను నివారించేందుకు తమ సహకారం ఉంటుందన్నారు.
క్యాన్సర్ పరిశోధనలు
మొదటిగా మూన్‌షాట్ క్యాన్సర్ కార్యక్రమాన్ని 2016లో నిర్వహించారు. క్యాన్సర్‌పై పరిశోధనను వేగవంతం చేసేందుకు రోగులు, వైద్యులు, పరిశోధనా సంఘాల్ని ఒకచోటుకు చేర్చారు. 2022లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రయత్నాలు పునరుద్ధరించారు. ఫెడరల్ ఏజెన్సీలను ఒక చోట చేర్చి వైట్‌హౌస్ ద్వారా క్యాన్సర్ క్యాబినెట్‌ను సైతం సమావేశపరిచారు. ఇప్పటి వరకు 5 వేర్వేరు దేశాల్లో 95 కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి విధానాలను, వనరులను అందించారు.