India US Relationship In Trump Regime : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఖరారైంది. ట్రంప్ హయాంలో భారత వ్యవహారాల్లో అమెరికా జోక్యం కాసింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడనుంది. ఐతే వాణిజ్యం పరంగా భారత్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. భారత నుంచి వస్తువుల దిగుమతిపై ట్రంప్ సుంకాలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ 2.0లో వాణిజ్యం, సైనిక సంబంధాలు, ఇమ్మిగ్రేషన్, దౌత్య సంబంధాలు వంటి అంశాల్లో భారత్-అమెరికా మధ్య బంధం ఎలా ఉండనుందో ఈ కథనంలో చూద్దాం.
భారత్‌కు అనుకూలమే - కానీ!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం భారత్‌కు కొంతమేర అనుకూలంగా మారే అవకాశం ఉంది. 2016లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత్ పట్ల సానుకూల వైఖరిని ట్రంప్ కనబర్చటం వల్ల చాలా మంది భారతీయులు ఆయన వైపు మొగ్గు చూపారు. ట్రంప్ విజయం వల్ల అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ మళ్లీ పదవిలోకి రావడం వల్ల భారత వ్యవహారాల్లో అమెరికా జోక్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలపడిందనేది కాదనలేని వాస్తవం. ట్రంప్ తొలి విడతలో హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈసారి ట్రంప్ 2.0లో కూడా ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సైనిక సంబంధాలు, ఇమ్మిగ్రేషన్, దౌత్య సంబంధాలు- ఇలా పలు రంగాల్లో అవకాశాలతో పాటు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపార అవకాశాలు పెరిగే ఛాన్స్!
ట్రంప్ మొదటి నుంచి చైనా పట్ల కఠిన వైఖరితో ఉంటారనేది బహిరంగ రహస్యం. అమెరికా వాణిజ్య సప్లయ్ చెయిన్ చైనాపై ఆధారపడకుండా చూస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇది భారత్‌కు లాభం చేకూర్చనుంది. చైనాపై ట్రంప్ టారిఫ్ యుద్ధం మళ్లీ మొదలుపెడితే మాత్రం భారత సంస్థలకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు అమెరికా మార్కెట్లోకి బలంగా వెళ్లేందుకు మార్గం లభిస్తుంది. అదే సమయంలో ప్రత్యక్ష పెట్టుబడులు భారత్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ రావడం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధ కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ట్రంప్ రాకతో రష్యా ఉక్రెయిన్ యుద్ద పరిస్థితుల్లో సానుకూల మార్పులు వస్తే, భారత్ సహా అనేక దేశాలకు మేలు జరుగుతుంది.
టారిఫ్స్ పెరిగే అవకాశం!
అదే సమయంలో ట్రంప్ వస్తే భారత్‌కు అంతా మేలే జరుగుతుందనే భ్రమపడే అవకాశాలు లేవు. తనను తాను సుంకాల రాజుగా అభివర్ణించుకునే ట్రంప్ హయాంలో వాణిజ్యం పరంగా భారత్‌కు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాణిజ్య విధానాలు అమెరికాకు నష్టం చేకూరుస్తున్నాయంటూ ట్రంప్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు భారత వస్తువులపై దిగుమతి సుంకం పెంచటానికి ట్రంప్ వెనకాడే ప్రసక్తి లేకపోవచ్చు. వాణిజ్యపరంగా ట్రంప్ అనుసరించే 'అమెరికా ఫస్ట్' విధానం భారత్‌కు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ట్రంప్ 2.0 హయాంలో వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని, ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో కంపెనీలు అత్యధికంగా ఆన్‌సైట్ మార్కెట్లలో స్థానికులనే నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే ఆందోళనలు ఉన్నాయి. దీంతోపాటు నియర్ షోర్ డెలివరీ సెంటర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
ఆటోమొబైల్ రంగంపై ప్రభావం!
ఆటోమొబైల్ రంగంలో భారత్ నుంచి విడిభాగాల ఎగుమతులు తగ్గుముఖం పట్టొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ట్రంప్ విద్యుత్తు వాహనాలకు ఇన్సెంటివ్‌లను తగ్గించే అవకాశాలుండటం వల్ల భారత్ నుంచి ఎగుమతి అయ్యే వాటి స్పేర్‌పార్టులపై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ అత్యధికంగా శిలాజ ఇంధనానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశలు ఉండడం వల్ల అమెరికాలో ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా వాటి ధరలు తగ్గవచ్చు. ఇది రిఫైనరీ రంగానికి, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలు నివేదికలు అంటున్నాయి.
సైనిక సంబంధాలు పరిస్థితి ఏమిటి?
ఇండో-పసిఫిక్ వ్యూహానికి మద్దతు ఇచ్చిన ట్రంప్ ఆయుధ విక్రయాల వంటి లావాదేవీలను పెంచుకోవడానికి యత్నించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో అమెరికా, భారత్ మధ్య సైనిక, రక్షణ సహకారాలు మెరుగుపడ్డాయి. బైడెన్ హయాంలో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, జెట్ ఇంజిన్‌ల తయారీకి GE-HAL ఒప్పందం లాంటి రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతో ఇరుదేశాల మధ్య సైనిక సహకారం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ తొలి హయాంలోనే క్వాడ్ పునరుద్ధరణ జరిగింది. రెండోసారి పదవీకాలంలోనూ రక్షణ రంగంలో సహకారం మరింత పెరిగే అవకాశం ఉంది.
అటు కౌంటర్ టెర్రరిజంలో భారత్‌కు అనుకూలంగా ట్రంప్ వైఖరి ఉండచ్చొనే అంచనాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని ఇటీవలే ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక అజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామన్నారు. తన పాలనలో ఇండియాతో పాటు తన స్నేహితుడు, ప్రధాని మోదీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటానని ట్రంప్ తెలపడం గమనార్హం.