How Israel Killed Hezbollah Chief : తమ బద్ధ శత్రువు హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. నస్రల్లాపై దాడిచేసి అంతమెుందించిన ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన ఓ గూఢచారి కీలకపాత్ర ఉన్నట్లు తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఆ గూఢచారి అందించిన సమాచారం ఆధారంగానే ఇజ్రాయెల్ కచ్చితమైన దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా ఎక్కడున్నారో కచ్చితమైన లొకేషన్‌ను ఇరాన్‌కు చెందిన ఓ గూఢచారి ఇజ్రాయెల్‌కు సమాచారం ఇచ్చినట్లు ఫ్రాన్స్ పత్రిక"ల పర్షియన్" ఓ వార్తా కథనం ప్రచురించింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలోని దాహియాలో నివాసగృహాల కింద భూగర్భంలో నస్రల్లా ఉన్నట్లు ఇజ్రాయెల్‌కు ఆ గూఢచారి సమాచారం అందించినట్లు పేర్కొంది.
అంతేకాకుండా, భూగర్భంలో హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయం ఉందని అక్కడ ఆ సంస్థకు చెందిన టాప్ కమాండర్లతో నస్రల్లా భేటీ అవుతున్నట్లు గూఢచారి పేర్కొన్నట్లు పత్రిక తెలిపింది. దీంతో నస్రల్లా స్థానాన్ని ధ్రువీకరించుకొన్న ఇజ్రాయెల్ నేరుగా ప్రధాన స్థావరంపై దాడి చేసి మొత్తం భవనాలను పేల్చేసింది. ఈ దాడుల్లో నస్రల్లాతో సహా పలువురు కీలక కమాండర్లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది.
నస్రల్లా హతం వెనుక ఇంకో థియరీ
హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా కదలికలపై కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్‌కు కచ్చితమైన సమాచారం అందుతున్నా దాడికి ప్రధాని బెంజమన్ నెతన్యాహు మంత్రి వర్గంలోని కొందరు వ్యతిరేకించినట్లు న్యూయార్క్‌టైమ్స్ పేర్కొంది. అయితే సమాచారం ఇస్తున్న గూఢచారి తమ నిఘా నుంచి దూరమైతే మళ్లీ సమాచార సేకరణ కష్టమవుతుందని భావించి ఈ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్వాడ్ సదస్సు కోసం అమెరికా పర్యటనకు వెళ్లిన నెతన్యాహు, సదస్సులో ప్రసంగానికి ముందు- ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు న్యూయార్క్‌టైమ్స్ వెల్లడించింది.
ఎటుచూసినా శిథిలాలే
అటు, శుక్రవారం బీరుట్ శివార్లలో ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన భవనాల శిథిలాల నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులతో ఆ ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు ఆరు భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరికొన్ని నివాసాలు కొంతమేర దెబ్బతిన్నాయి. ఎటు చూసిన శిథిలాలే కనిపిస్తున్నాయి.
హమర్స్ ఆపరేషన్
హసన్ నస్రల్లాను మట్టుబెట్టిన ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన 69వస్క్వాడ్రన్ పాల్గొంది. ఈ స్క్వాడ్రన్‌నే హమర్స్ అని పిలుస్తారు. ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు న్యాయ సంస్కరణలు వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన హామర్స్, తాజాగా ఏకంగా హెజ్‌బొల్లా అధినేత నస్రల్లాను లెబనాన్‌లో అంతమొందించింది.
ఆపరేషన్ న్యూఆర్డర్ పేరిట హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై చేసిన దాడి కోసం హట్‌జెరిమ్ ఎయిర్ బేస్‌కు కొత్త కమాండింగ్ ఆఫీసర్‌గా బ్రిగేడియర్ జనరల్ అమిచయ్ లెవినెను నియమించారు. హమర్స్ స్క్వాడ్రన్ ఎఫ్-15ఐ రామ్ ఫైటర్ జెట్స్‌ను వాడుతుంది. గతంలో సిరియా, లెబనాన్‌లో కఠినమైన ఆపరేషన్లు చేసిన అనుభవం ఇక్కడి సిబ్బందికి ఉంది. నస్రల్లాపై దాడికి దాదాపు 100 బాంబులను ప్రతి రెండు సెకన్లకు ఒకటి చొప్పున లక్ష్యంపై జారవిడిచినట్లు లెవినె వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారిలో సగం మంది రిజర్విస్టులే అని పేర్కొన్నారు.