Hezbollah Israel Rocket Attacks : హమాస్ అగ్రనేత హనియా హత్యతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ దాడిని ఇజ్రాయిల్ చేయించిందని హమాస్ ఆరోపించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
మరోవైపు అటు హమాస్ మరో కీలక నేత డెయిఫ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ వరుస పరిణామాల తర్వాత హమాస్, ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెసెస్-IDF హైఅలర్ట్ ప్రకటించింది.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ఇరాన్ ముప్పు నుంచి టెల్ అవీవ్‌కు తాము భద్రత కల్పిస్తామంటూ బైడెన్ హామీ ఇచ్చినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.
అయితే ఇజ్రాయెల్‌పై ఇరాన్, హెజ్‌బొల్లా, హమాస్ దాడి చేయవచ్చన్న వార్తల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకూ టెల్‌అవీవ్ నుంచి వచ్చే అక్కడకు వెళ్లే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ఇండియా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఆగస్టు 8వ తేదీ వరకు దిల్లీ-టెల్ అవీవ్ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మినహాయింపులు కూడా ప్రకటించింది. టికెట్ల రద్దు, రీ షెడ్యూలింగ్‌పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామంటూ తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దిల్లీ- టెల్ అవీవ్ మధ్య ఎయిర్ ఇండియా వారానికి నాలుగు సర్వీసులను నడుపుతోంది.
ఇదిలా ఉండగా, హెజ్‌బొల్లా సీనియర్ మిలటరీ కమాండర్ పాధ్ షుక్ర్ మృతిచెందిన 48 గంటల్లోనే, ఇజ్రాయెల్ భూభాగంపైకి రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడి స్వయంగా తామే చేశామని హెజ్‌బొల్లా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) కూడా ధ్రువీకరించింది. అయితే వీటివల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది.
'హమాస్ మిలటరీ చీఫ్‌ను అప్పుడే లేపేశాం'- ఇజ్రాయెల్ సంచలన ప్రకటన - Hamas Military Wing Chief Dead
'ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌కు భద్రత కల్పిస్తాం' - నెతన్యాహుకు బైడెన్ అభయం!