Muhammad Yunus On Sheikh Hasina : భారత్‌లో కూర్చొన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరే వరకు, ఆమె భారత్‌లో మౌనంగా ఉండాలని అన్నారు. లేకపోతే ఆమె వ్యాఖ్యలు ఇరు దేశాల సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ మేరకు రాజధాని ఢాకాలో తన అధికారిక నివాసంలో యూనస్ మీడియాతో మాట్లాడారు.
"హసీనాను తిరిగి స్వదేశానికి పంపాలని బంగ్లాదేశ్ అడిగే వరకు ఆమె భారత్‌లోనే ఉండిపోతే, మౌనంగా ఉండాలి. ఆమె అక్కడ ఉండి మాట్లాడటం ఇబ్బందిగా మారుతుంది. ఆమె మౌనంగా ఉంటే మేం దానిని మర్చిపోతాం. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సూచనలు చేయడాన్ని ఎవరూ ఇష్టపడరు. దేశంలో దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉంది. న్యాయం జరగాలంటే తిరిగి ఆమెను వెనక్కి తీసుకురావాలి. లేకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరు. ఆమె పాల్పడిన దురాగతాలను అందరి ముందు విచారించాల్సిందే" అని యూనస్ అన్నారు.
హిందువులపై దాడులు అందుకే!
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు రాజకీయ కారణంగానే జరుగుతున్నాయని యూనస్ తెలిపారు. అందులో మతతత్వ కోణం లేదని పేర్కొన్నారు. భారత్‌లో ఈ అంశాన్ని ఎక్కువ చేసి చూపిస్తారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హిందువులు రాజకీయంగా మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌కు మద్దతు ఇచ్చారనే అభిప్రాయం ఉండటం వల్ల కొందరు వారిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పినట్లు మహమ్మద్ యూనస్ వెల్లడించారు.
అలాగే భారత్‌తో సంబంధాల గురించి మాట్లాడారు. తాము భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపారు. హసీనా నాయకత్వంతోనే బంగ్లాదేశ్‌లో స్థిరత్వం ఉంటుందనే ధోరణిని భారత్ విడనాడాలంటూ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా కొన్నిరోజుల క్రితం బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు.
బంగ్లాలో బిక్కుబిక్కుమంటూ హిందువులు! మైనార్టీలపై దాడులకు కారణం అదేనా? - Attacks On Bangladesh Hindus