US Citizenship Under New Plan : మరికొన్ని నెలల్లో దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వలసదారులను ఆకట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో చట్టపరమైన హోదా లేని యూఎస్ పౌరుల జీవిత భాగస్వాములు - శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరికొద్ది నెలల్లో బైడెన్ ప్రభుత్వం అనుమతిస్తుందని వైట్ హౌస్ మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 5 లక్షల మంది వలసదారులకు ఊరట కలగనుందని శ్వేత సౌధం సీనియర్ పాలనాధికారి తెలిపారు.
ఇవి అర్హతలు
అమెరికా పౌరసత్వం దక్కాలంటే వలసదారుడు (2024 జూన్ 17) నాటికి అగ్రరాజ్యంలో 10 ఏళ్లు నివసించి ఉండాలి. అలాగే అమెరికా పౌరులను వివాహం చేసుకుని ఉండాలి. వలసదారుని దరఖాస్తును వైట్‌హౌస్ అమోదిస్తే, గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మూడు సంవత్సరాల గడువు ఉంటుంది. అంత వరకు తాత్కాలిక వర్క్ పర్మిట్‌ను ఇస్తారు.
అమెరికన్ చట్టాల ప్రకారం, వలసదారులు, అమెరికా పౌరులను వివాహం చేసుకున్నా, వారి పిల్లలకు పౌరసత్వం లభించడం లేదు. కానీ త్వరలో యూఎస్ పౌరులను వివాహం చేసుకున్న మహిళలు, పురుషులతో సహా, సుమారు 50,000 మంది పిల్లలకు కూడా అమెరికన్ పౌరసత్వం లభిస్తుందని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.
"వలసదారులు 2024 జూన్ 17వ తేదీకి అమెరికాలో 10 ఏళ్లు నివసించి ఉండాలి. అప్పుడే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు. వేసవి చివరి నాటికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని అనుకుంటున్నాం. దరఖాస్తు ఫీజు ఇంకా నిర్ణయించాల్సి ఉంది. బైడెన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో 5 లక్షల మంది వలసదారులు అమెరికా పౌరతత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. మంగళవారం వైట్‌హౌస్‌లో జరిగే కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రణాళిక గురించి మాట్లాడతారు. వలసదారులకు చట్టపరమైన హోదా కల్పించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలం నుంచే డిమాండ్ వినిపిస్తోంది." అని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
నవంబరులో ఎన్నికలు- కీలక నిర్ణయం
మెక్సికో సరిహద్దులో వలసదారులపై అమెరికా అణిచివేతకు పాల్పడిన తర్వాత బైడెన్ సర్కార్ పౌరసత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది నవంబరులో అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ చేస్తున్నారు. 2020లో కూడా వీరిద్దరే పోటీ పడగా, జో బైడెన్ విజయం సాధించి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.
గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు- అంతా హడల్! ఆ పక్షి వల్లేనా?