Gaza Ceasefire Un Security Council : రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి డిమాండ్ చేసింది. దీంతోపాటు బందీలను హమాస్ విడుదల చేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. మొత్తం 15 సభ్య దేశాల్లో 14 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా వీటో జారీ చేయకుండా తీర్మానం ఆమోదం పొందేందుకు ఓటింగ్‌కు దూరంగా ఉంది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన 5 నెలల తర్వాత కాల్పుల విరమణకు సంబంధించి భద్రతా మండలి తీర్మానం చేయటం ఇదే మొదటి సారి. గతంలో తీర్మానాలను ప్రవేశపెట్టినా వీటో అధికారంతో లేదంటే వ్యతిరేకతతో సభ్య దేశాలు అడ్డుకున్నాయి.
-
The Security Council just approved a long-awaited resolution on Gaza, demanding an immediate ceasefire, and the immediate and unconditional release of all hostages.
— António Guterres (@antonioguterres) March 25, 2024
This resolution must be implemented. Failure would be unforgivable.
తప్పనిసరిగా అమలు చేయాలి
భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని వెంటనే పాటించాలి అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. 'సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని డిమాండు చేసింది. దీంతోపాటు తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది. ఈ తీర్మానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. విఫలం కావడమనేది క్షమించరానిది' ఆంటోనియో గుటెరస్ ఎక్స్ వేదికగా తెలిపారు.
అమెరికా పర్యటన రద్దు
అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించకుంటే వాషింగ్టన్ నుంచి తమ రాయబారులను వెనక్కి తీసుకుంటామన్న ఇజ్రాయెల్ హెచ్చరికలను అగ్రరాజ్యం పట్టించుకోలేదు. భద్రతా మండలిలో తీర్మానాన్ని అడ్డుకోకపోవడం వల్ల నిరసనగా అమెరికా పర్యటనను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రద్దు చేసుకున్నారు. బందీలను విడుదల చేసే నిబంధన పెట్టకుండా అమెరికా తీర్మానం ఆమోదం పొందేలా సహకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. రఫాలో భూతల దాడుల ప్రణాళికను అమెరికాకు వివరించేందుకు ఇజ్రాయెల్ అత్యున్నత స్థాయి బృందం వెళ్లాల్సి ఉంది. అయితే భద్రతా మండలిలో అమెరికా తీరును జాతీయ భద్రతా విభాగ శ్వేతసౌధ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ సమర్థించుకున్నారు. బందీల విడుదలలో భాగంగా కాల్పుల విరమణే తమ డిమాండని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన
గాజాపై ఇజ్రాయెల్ దాడిని త్వరగా ముగించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. అలాగే ఇజ్రాయెల్‌కు తగ్గుతున్న అంతర్జాతీయ మద్దతు గురించి కూడా హెచ్చరించారు. ప్రపంచ దేశాల మద్దతు కోల్పోతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోసారి విషం కక్కిన చైనా- అరుణాచల్‌పై మళ్లీ అదే పాట - China On Arunachal Pradesh
కరెంట్ షాక్‌తో ఇంటరాగేషన్!- నేరాన్ని ఒప్పుకున్న రష్యా ఉగ్రదాడి నిందితులు - russia attack suspects