US Elections Trump : వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు, అమెరికన్లలో అత్యంత సంపన్నుల్లో ఒకరు డొనాల్డ్ ట్రంప్. స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీలకు దీటుగా పేరు ప్రఖ్యాతులున్నాయి. ప్రపంచ వ్యాప్త వాణిజ్య సామ్రాజ్యంతో క్షణం తీరికలేని డొనాల్డ్ ట్రంప్‌లో ఎప్పటినుంచో అమెరికా అధ్యక్ష పదవిపై ఆసక్తి ఉన్నా, శ్వేతసౌధంలో జరిగిన ఓ ఘోర అవమానం ఆయనలో కసి, పట్టుదల పెంచింది. అదే అధ్యక్ష పదవిని చేపట్టేలా చేసింది. ఇంతకీ ఏమి జరిగిదంటే?
కరస్పాండెంట్స్ విందులో అవమానం
ఏటా అమెరికా అధ్యక్షుడిచ్చే ఈ విందుకు దేశంలోని ప్రముఖులను కూడా ఆహ్వానిస్తారు. అలా అమెరికాలో అప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త, టీవీ షోలతో సెలబ్రిటీగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ కూడా 2011 ఏప్రిల్‌లో జరిగిన విందుకు హాజరయ్యారు. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా విందుకు వచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగం మొదలెట్టారు. మధ్యలో ఉన్నట్టుండి ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బికినీలు వేసుకున్న అమ్మాయిలతో ఆయన టీవీ షోల గురించి ప్రస్తావిస్తూ, ఎకసెక్కాలాడారు. అందుకు కారణం లేకపోలేదు. అంతకుముందు అధ్యక్ష ఎన్నికల వేళ ఒబామా కెన్యాలో పుట్టాడని, అమెరికాలో జన్మించలేదని, అందుకే అధ్యక్షపదవికి అనర్హుడని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు మీడియాలో వచ్చింది. ఆ వివాదం సద్దుమణిగి అధ్యక్షుడిగా ఎన్నికైనా ఒబామా దాన్ని మనసులో పెట్టుకున్నారు. ఈ విందులో ప్రతీకారం తీర్చుకున్నారు. విందుకు వచ్చినవారంతా ఒబామా వెటకారాన్ని విని పడీపడీ నవ్వుతుంటే, ట్రంప్ తలవంచుకొని ఉండిపోయారు. ఫలితం 2016లో బలమైన హిల్లరీ క్లింటన్‌ను ఓడించి మరీ శ్వేతసౌధంలో అడుగుపెట్టారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ రెండోసారి కూడా మహిళా అభ్యర్థి కమలా హారిస్‌పై నెగ్గి అరుదైన ఘనత సాధించారు.
జీవితాన్ని మార్చిన సైనిక అకాడమీ
న్యూయార్క్ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఫ్రెడరిక్ ట్రంప్, మేరీ దంపతుల నాలుగో సంతానం డొనాల్డ్ ట్రంప్. 1946 జూన్ 14న న్యూయార్క్ శివార్లలోని క్వీన్స్‌లో ట్రంప్ జన్మించారు. పాఠశాలలో తోటి విద్యార్థులతో ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల 13 ఏళ్ల వయసులో ట్రంప్‌ను తండ్రి సైనిక అకాడమీలో చేర్పించారు. ఇది ఓ రకంగా ట్రంప్ జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. 'నేను మిలిటరీ అకాడమీకి వెళ్లినప్పుడు జీవితంలో తొలిసారి వేరొకరు నా చెంప చెళ్లుమనిపించారు. ఇది నేను ఊహించలేదు' అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఉద్వేగాలకు దూరంగా ఉండటం తండ్రి నుంచే నేర్చుకున్నానంటారు ట్రంప్. ఈ భూమిపై విజేతలు, పరాజితులు మాత్రమే ఉంటారని, ఈ ప్రపంచంలో ముందుకు దూసుకెళ్లాలంటే విజేతగా నిలవాలని యుక్తవయసులో తండ్రి నేర్పిన సూత్రాన్ని ట్రంప్ బాగా ఒంటబట్టించుకున్నారు.
తండ్రి నుంచి అప్పు తీసుకొని
అన్నయ్య ఫ్రెడ్ పైలట్‌గా మారాలని నిశ్చయించుకోవడం వల్ల తండ్రి వ్యాపార సామ్రాజ్యంలోకి ట్రంప్ తొందరగానే ప్రవేశించారు. వార్టన్ స్కూల్ ఆఫ్ పైనాన్స్ నుంచి 1968లో ఆర్థికశాస్త్రంలో పట్టా సంపాదించిన ట్రంప్, తన తొలి వ్యాపారానికి తండ్రి నుంచే అప్పు తీసుకోవడం గమనార్హం. పది లక్షల డాలర్ల అప్పుతో స్తిరాస్థి రంగంలోకి ప్రవేశించిన ట్రంప్, బ్రూక్లిన్, క్వీన్స్‌కు పరిమితమైన కుటుంబ వ్యాపారాన్ని మన్‌హట్టన్‌కు తీసుకెళ్లారు. అక్కడి ఫిప్త్ అవెన్యూలో 68 అంతస్తుల ట్రంప్ టవర్ నిర్మించి, తన వ్యాపార సామ్రాజ్యాన్ని వివిధ రంగాలకు విస్తరించారు. 2003లో ఎన్‌బీసీలో ట్రంప్ 'ది అప్రెంటీస్' అనే షో కూడా చేశారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులను తన సంస్థల్లోకే తీసుకున్నారు.
మద్యానికి దూరం
ట్రంప్ టీవీ చూస్తూ గడపటానికి ప్రాధాన్యం ఇస్తారు. ఆయన మద్యం ముట్టరు. 'మా పెద్దన్న ఫ్రెడ్ నాకో ఉదాహరణగా నిలిచారు. ఉదాహరణంటే ఏదో అనుకునేరు. చాలా మంచి మనిషి. కానీ తాగుడుకు బానిసై, దానికారణంగానే చనిపోయారు. అప్పట్నుంచి నేనెన్నడూ మందు ముట్టనని నిర్ణయించుకున్నా. నా పిల్లలకు కూడా రోజూ అదే నూరిపోస్తుంటా. నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో సిగరెట్స్. మందు విషయంలోనైతే నా పిల్లలతో చాలా కఠినంగా వ్యవహరిస్తా' ట్రంప్ అంటారు. 'సమావేశాలు, వ్యాపార సదస్సులు, ఒప్పందాలకు వెళ్లినా ట్రంప్ ఎంతో నిగ్రహంతో ఉంటారు. అంతా తాగుతుంటే తాను మాత్రం వ్యాపారం చక్కబెట్టుకుంటారు. ఎవరేమన్నా పట్టించుకోరు. రాత్రి ఇంట్లో టీవీ పెట్టుకొని స్పోర్ట్స్ చూస్తూ బర్గర్ తింటూ గడుపుతారు' అని ట్రంప్ జీవితకథ రాసిన ఓబ్రెయిన్ వ్యాఖ్యానించారు.
80ల్లోనే అధ్యక్ష పదవిపై కన్ను
రాజకీయాలపై ట్రంప్ ఆసక్తి ఇప్పటిది కాదు. 1988లోనే ఆయన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో నిలవాలన్న ఆసక్తిని కనబరిచారు. రిఫార్మ్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా 2000లో రంగంలోకి దిగారు కూడా. వైట్‌హౌస్ రేసులో ఉన్నట్లు 2015లో ట్రంప్ లాంఛనంగా ప్రకటించారు. 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' ప్రచారంతో అమెరికా ఆర్థికంగా బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ నుంచి హేమాహేమీలు ఉన్నా చివరకు ట్రంపే 2016లో అధ్యక్ష అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ట్రంప్‌ను ప్రతికూల పవనాలు ఉక్కిరిబిక్కిరి చేసినా తట్టుకొని నిలబడి విజయం సాధించారు.
అదే తెంపరితనం
ప్రత్యర్థి వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తే తగ్గే రకం కాదు ట్రంప్. ఈసారి పలు సంవాదాల్లో ప్రత్యర్థి కమలా హారిస్ ఇరకాటంలో పెట్టినా, ట్రంప్ మాత్రం తనదైన దూకుడుతో, వ్యక్తిగత వ్యాఖ్యలతో ఆమెను లక్ష్యంగా చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్లారు. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా మార్చడం, అక్రమ వలసలను నియంత్రించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం, యుద్ధాలకు దూరంగా ఉండాలనడం, ఆర్థిక వ్యవస్థ పునర్ నిర్మాణం ఇలా అనేక అంశాలపై ప్రజలకు హామీలు ఇచ్చి వారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అహర్నిశలూ శ్రమించి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ట్రంప్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1977లో చెక్ మోడల్, అథ్లెట్ ఇవానా జెలిన్‌కోవాను పరిణయమాడారు. వారికి ముగ్గురు సంతానం (డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్). 1990లో విడిపోయారు. 1993లో నటి మార్లా మేపుల్స్‌ను పెళ్లి చేసుకున్న ట్రంప్ 1999లో ఆమెతో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె (టిఫాని). ప్రస్తుత భార్య మెలనియాను 2005లో వివాహమాడారు. ఆమె స్లొవేనియా మోడల్. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.
కేసులన్నీ హుష్‌కాకేనా?
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై కేసుల సంగతి ఆసక్తికరంగా మారింది. 2020 ఎన్నికల తర్వాత వరుసగా ఆయన అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. వీటిలో కొన్ని క్రిమినల్ కేసులుకాగా, మరికొన్ని సివిల్ కేసులు. అయితే ఫెడరల్ కేసుల్లోంచి ఆయన బయటపడే అవకాశం ఉంది. కానీ పోర్న్‌స్టార్‌కు డబ్బులిచ్చిన న్యూయార్క్ కేసు, 2020లో జార్జియా ఫలితాన్ని తారుమారు చేయటానికి ప్రయత్నించారన్న కేసులో మాత్రం ఆయన విచక్షణాధికారాలు పనికిరావన్నది నిపుణుల మాట. పోర్న్‌స్టార్ కేసులో న్యూయార్క్ న్యాయస్థానం ఈనెల 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. ఒకవేళ తీర్పు వచ్చినా పడీపడని స్వల్ప శిక్షగానీ, లేదంటే ట్రంప్ పదవి నుంచి దిగిపోయేదాకా వాయిదా వేయటంగానీ జరగొచ్చు. ఎందుకంటే అధ్యక్షుడిగా పదవిలో ఉన్నంతకాలం ఆయన ఎలాంటి శిక్ష అనుభవించరు. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి మరింత సమయం ఉన్నందున ఆ లోపు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. కానీ ట్రంప్ అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైనందున ఆయనపై కేసులన్నీ హుష్‌కాకి అయిపోతాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించటం గమనార్హం.