Explosion In Pakistan Airport : పాకిస్థాన్ కరాచీలోని జిన్న అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులు సహా ఒక పాకిస్థానీ మృతిచెందారు. మరో 17మంది గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ ఆయిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయని, ఆ తర్వాత అక్కడున్న మరికొన్ని వాహనాలకు మంటలు వ్యాపించాయని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఈస్ట్ అజ్ఫర్ మషేహర్ తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రవాద హస్తం ఉండే అంశాన్నితోసిపుచ్చలేమని చెప్పారు.
పోర్ట్ ఖాసిం ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (ప్రైవేట్) లిమిటెడ్ కంపెనీలో పనిచేసే చైనా సిబ్బందిని తీసుకెళ్తున్న కాన్వాయ్‌పై రాత్రి 11 గంటల సమయంలో దాడి జరిగిందని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులు మరణించారని, మరొకరు గాయపడ్డారని ఒక పాకిస్థానీ కూడా మరణించినట్లు చెప్పింది. అంతేకాకుండా ఈ ఘటనను ఉగ్రదాడిగా డ్రాగన్ పేర్కొంది. ఈ ఘటన తర్వాతి పరిణామాలపై పాకిస్థాన్‌తో చైనా కలిసి పనిచేస్తోందని తెలిపింది. ఈ పేలుడుపై సమగ్ర విచారణ జరిపించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. పాక్‌లోని చైనా పౌరులు, కంపెనీలు, ప్రాజెక్టుల భద్రతపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
#WATCH | At least three foreign nationals died while 17 others sustained injuries in a huge explosion near Jinnah International Airport, Karachi, reports Pakistan's Geo News.
— ANI (@ANI) October 7, 2024
(Video: Reuters) pic.twitter.com/qrJdStV9F7
అయితే వీదేశీయులు టార్గెట్‌గా ఈ దాడి జరిగిందని ప్రోవిన్సియల్ హోం మంత్రి జయి ఉల్ హసన్ స్థానిక మీడియాకు తెలిపారు. ఇక, ఏయిర్‌పోర్టులో చాలా పెద్ద పేలుడు సంభవించిందని, ఆ పేలుడు ధాటికి విమానాశ్రయ భవనాలు కంపించాయని అక్కడ పనిచేస్తున్న రాహత్ హుస్సేన్ తెలిపారు. కాగా, చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా వేల మంది చైనీయులు పాకిస్థాన్‌లో పనిచేస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనా దేశస్థులు సహా ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఇస్లామాబాద్ నుంచి కోహిస్థాన్ వెళ్తున్నపేలుడు పదార్థాలతో నిండిన వాహనం, షాంగ్లా జిల్లాలోని బిషామ్ ప్రాంతంలో ఓ బస్సును ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో బస్సులో ఉన్న చైనీయులతో పాటు డ్రైవర్ ఉన్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.