Chile Forest Fire : లాటిన్ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సెంట్రల్ చిలీ అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా సుమారు 46 మంది మృతి చెందినట్లు అక్కడి మంత్రి కరోలినా తోహా వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ క్రమంలో సెంట్రల్ చిలీలో అత్యయిక పరిస్థితి విధించినట్లు ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ శనివారం వెల్లడించారు.
1100 ఇళ్లు అగ్నికి ఆహుతి!
శుక్రవారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,100 ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. పర్యాటక ప్రాంతాలైన వినా డెల్‌మార్, వాల్పరైజో ప్రాంతాల్లో మంటల తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ వ్యాపించడం వల్ల ఆయా ప్రాంతాల్లోని పర్యాటకులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ హెచ్చరించింది.
'వాల్పరైజో ప్రాంతంలో నాలుగు పెద్ద కార్చిచ్చులు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మంటలు అంటుకున్న ప్రాంతాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు చిలీ ప్రజలు సహకరించాలి' అని అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ కోరారు.
"మంటలు వేగంగా వ్యాప్తిస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారాయి. తక్కువ తేమ శాతం, అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలుల కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతుంది. మీరు నివసిస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధికారులు కోరితే వెంటనే ఖాళీ చేయండి."
- గాబ్రియల్ బోరిక్, చిలీ అధ్యక్షుడు
'43వేల ఎకరాల్లో మంటలు!'
'దేశంలోని సెంట్రల్, దక్షిణ ప్రాంతాల్లోని సుమారు 92 అడవుల్లోని 43వేల ఎకరాల్లో ఈ కార్చిచ్చు మంటలు చెలరేగాయి. ఈ వారం ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న వారిపై ప్రభావం అధికంగా ఉంది. ఈ కారణంగా వేలాది మంది ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది' అని హోం మంత్రి కరోలినా తోహా తెలిపారు.
భారత్‌పై మరోసారి కెనడా అక్కసు- దేశ ఎన్నికల్లో విదేశీ ముప్పు అంటూ!
పాక్ మాజీ ప్రధానికి మరో షాక్- చట్టవిరుద్ధ వివాహం కేసులో ఏడేళ్లు జైలు శిక్ష