Canada India Relations : భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ జస్టిన్ ట్రూడో సర్కారు మరో కవ్వింపు చర్యలకు పాల్పడింది. హ్యాకింగ్, సైబర్ గూఢచర్యానికి పాల్పడే దేశాల జాబితాలో భారత్‌ను పేరును ప్రస్తావించింది. మరోవైపు కెనడాలో ఖలిస్థానీయులపై దాడుల వెనక భారత హోం మంత్రి అమిత్‌షా పాత్ర ఉందంటూ కథనాలు వెలువడటంపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది.
ఇరాన్, సౌత్ కొరియాలతో పాటు భారత్
2025-26 ఏడాదికి సంబంధించి 'జాతీయ సైబర్ ముప్పు అంచనా' నివేదికను కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ విడుదల చేసింది. ఇందులో భారత్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. 'గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో కెనడాకు వ్యతిరేకంగా భారత్ నుంచి దేశ ప్రాయోజిత సైబర్ దాడులు జరగొచ్చని అంచనా వేస్తున్నాం. అంతర్జాతీయ వేదికపై అధికార శక్తిగా మారాలని ఆకాంక్షిస్తున్న భారత్ వంటి దేశాలు మాకు వ్యతిరేకంగా వివిధ స్థాయుల్లో సైబర్ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి. తమ దేశం ఎదుర్కొంటున్న సైబర్ ముప్పులు, ప్రాంతీయ ప్రత్యర్థుల నుంచి జరిగే హ్యాకింగ్‌పై దృష్టిపెడుతూనే విదేశాల్లో ఉన్న వారి అసమ్మతివాదులను (ఖలిస్థానీ వేర్పాటువాదులను ఉద్దేశిస్తూ) ట్రాక్ చేసేందుకు సైబర్ సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నారు' అని కెనడా తమ నివేదికలో ఆరోపించింది. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా తరహాలోనే భారత్‌ను కూడా తమ దేశానికి ముప్పుగా పరిగణిస్తున్నామంటూ మళ్లీ నోరు పారేసుకుంది.
అమిత్‌షాపై ఆరోపణలు ఆందోళనకరం
మరోవైపు, కెనడాలో ఖలిస్థానీలపై దాడుల వెనక భారత హోంశాఖ మంత్రి అమిత్‌షా పాత్ర ఉందంటూ ట్రూడో సర్కారు చేసిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని అమెరికా పేర్కొంది. ఈ విషయంపై తాము ఒటావోతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లోఈ విషయాన్ని వెల్లడించారు.
కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మోరిసన్ ఆ దేశ పార్లమెంట్ ప్యానెల్ ముందు వాంగ్మూలం ఇస్తూ అమిత్‌షా పేరును తానే వాషింగ్టన్ పోస్టుకు వెల్లడించానన్నారు. సిక్కు వేర్పాటువాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని, వారిపై హింసాత్మక చర్యలు తీసుకోవాలని భారత హోం మంత్రి అమిత్‌షా ఆదేశాలు జారీ చేసినట్లు మోరిసన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ విషయాన్నే సదరు పత్రికా విలేకరికి కూడా వెల్లడించామన్నారు.
కెనడాలో నివాసం ఉంటున్న ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్‌ను గతేడాది బ్రిటిష్ కొలంబియాలో కొందరు కాల్చి చంపారు. దీనిలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో బహిరంగ ఆరోపణలు చేశారు. కానీ, ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలను బహిర్గతం చేయలేదు. ఆయన ఇటీవల పార్లమెంటరీ ప్యానల్ ఎదుట మాట్లాడుతూ భారత్‌పై ఆరోపణలు చేసే నాటికి తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.