Gun Ban In Canada : ప్రపంచవ్యాప్తంగా తుపాకీల సంస్కృతి రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈక్రమంలోనే పలు దేశాలు దీన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా కెనడా ప్రభుత్వం సైతం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి 324 రకాల తుపాకీలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. అయితే, వాటిని ఉక్రెయిన్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలు ప్రచురించాయి.
2020 మేలో కెనడా 1,500 రకాల మారణాయుధాలపై నిషేధం విధించింది. ఈ ఏడాది నవంబరు నాటికి 2వేల కంటే ఎక్కువ కొత్త ఆయుధాలు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. దీంతో 324 రకాల ఆయుధాలపై నిషేధం విధించనున్నట్లు ప్రజా భద్రతా మంత్రి డొమినిక్ లే బ్లాంక్ పేర్కొన్నారు. 'వేటగాళ్లు, క్రీడాకారుల చేతుల్లో అటువంటి తుపాకీలు ఉండటం శ్రేయస్కరం కాదు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ఆ తుపాకీలు అందించేందుకు మా అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. కీవ్‌కు మేము అందించే ప్రతి సహాయం వారి విజయానికి అడుగులు వేస్తోంది' అని లేబ్లాంక్ పేర్కొన్నారు.
కెనడాలో సామూహిక కాల్పులు జరగడం చాలా అరుదు. అయితే, ఇటీవల కెనడాలోని ఓ ప్రాంతంలో సామూహిక కాల్పుల ఘటన జరిగింది. ఓ దుండగుడు 14 మంది మహిళలపై కాల్పులు జరిపి ఆ తర్వాత తనని తాను కాల్చుకున్నాడు. ఆ నిందితుడు ఉపయోగించిన రుగర్ మినీ-14 అనే తుపాకీ 2020లో నిషేధించడం గమనార్హం. ఈక్రమంలోనే పలు రకాల తుపాకీలను నిషేధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకుంది.