Bridge Collapse In Baltimore Maryland : అమెరికా బాల్టిమోర్‌లోని ఓ ప్రధాన బ్రిడ్జి పేక మేడలా కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఒక కార్గో నౌక, బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొనడం వల్ల 'ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి' కుప్ప కూలింది. మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ ఘటన జరిగిన సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. నీటిలో పడిపోయిన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఈ ఘటనలో ఎంత మంది గాయపడ్డారో స్పష్టం కాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బ్రిడ్జిని ఢీకొన్ని నౌక సింగపూర్‌కు చెందినదిగా అధికారులు తెలిపారు. ఆ కార్గో షిప్‌లో 22 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా భారతీయులేనని సదరు కంపెనీ వెల్లడించింది. సింగపూర్‌కు చెందిన గ్రీస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్గో నౌక 'దాలీ' బాల్టిమోర్ నుంచి కొలంబోకు బయలుదేరింది. మధ్యలో అర్ధరాత్రి దాదాపు 1.30గంటల సమయంలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్‌లోని ఓ పిల్లర్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో ఇద్దరు పైలట్లు విధుల్లోనే ఉన్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ప్రమాద ఘటనపై అమెరికా దర్యాప్తు మొదలుపెట్టింది. ఇందుకు నౌక సిబ్బంది పూర్తిగా సహకరిస్తున్నారని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.
-
Breaking: 🚨 The Francis Scott Key Bridge in Baltimore has collapsed after being struck by a cargo ship overnight. This is a mass casualty event. pic.twitter.com/fsPigSo9iT
— Vince Langman (@LangmanVince) March 26, 2024
1977లో ప్రారంభించిన ఈ బ్రిడ్జిని బాల్టిమోర్‌లోని పటాప్‌స్కో నదిపై నిర్మించారు. 'ది స్టార్-స్పాంగ్లిల్డ్ బ్యానర్' అనే అమెరికా జాతీయ గీతం రాసిన ఫ్రాన్సిస్ స్కాట్ కీ పేరును ఈ బ్రిడ్జికి పెట్టారు. బాల్టిమోర్ నౌకాశ్రయంతో పాటు, తీర ప్రాంతంలో షిప్పింగ్‌కు ఈ బ్రిడ్జి ప్రధాన రవాణా మార్గంగా ఉంది. తాజా ఘటనతో పటాప్‌స్కో నది మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి.
నౌక ఢీకొని రెండు ముక్కలైన బ్రిడ్జి
ఇటీవల ఇలాంటి ఘటనే చైనా గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నదిపై జరిగింది. ఖాళీగా వెళ్తున్న ఓ భారీ కంటైనర్ నౌక పెరల్ నదిపై నిర్మించిన వంతెనను బలంగా ఢీ కొట్టింది. కంటైనర్ నౌక ఢీ కొట్టడం వల్ల భారీ వంతెన రెండు ముక్కలై పాక్షికంగా కూలిపోయింది. ఈ సమయంలో వంతెనపై వెళ్తున్న బస్సు ఖాళీ నౌకలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మరణించగా మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో వంతెనపై వాహనాల రద్దీ తక్కువగా ఉందని లేకపోతే మరింత మంది మరణించి ఉండేవారని అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం వంతెన స్తంభాల మధ్యే కంటైనర్ నౌక చిక్కుకుపోయిందని అధికారులు వెల్లడించారు. నదిలో పడిపోయిన బస్సులో డ్రైవర్ మాత్రమే ఉన్నారని ప్రమాద మృతుల్లో ఆయనొకరని చైనా పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన నౌక కెప్టెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
మరోసారి విషం కక్కిన చైనా- అరుణాచల్‌పై మళ్లీ అదే పాట - China On Arunachal Pradesh