Sheikh Hasina Statement : దేశం విడిచిన తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాలో అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలపై జరిగిన హింసను ఉగ్రదాడులుగా అభివర్ణించారు. బంగ్లాదేశ్లో హత్యలు, విధ్వంసంపై సరైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ విషయంలో తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. జులైలో నిరసనలు మొదలైనప్పటి నుంచి నిరసనల పేరుతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతులకు నివాళిగా ఈ నెల 15ను జాతీయ సంతాప దినంగా జరపాలన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన హసీనా ప్రకటనను, ఆమె తనయుడు సాజిబ్ వాజెద్ జాయ్ 'ఎక్స్' వేదికగా విడుదల చేశారు.
"విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, గర్భిణీలు, పాత్రికేయులు, సాంస్కృతిక కార్యకర్తలు, శ్రామికులు, నాయకులు, అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థల కార్యకర్తలు, అనేక సంస్థల ఉద్యోగుల మరణాలకు నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆత్మీయులను కోల్పోయిన నాలాంటి వారి పట్ల నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ నెల 15న బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాను." అని హసీనా ప్రకటనలో తెలిపారు.
కాగా, ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. ఆమెతో పాటుగా మరో ఆరుగురిపైన కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
రిజర్వేషన్లకు రద్దుచేసి ప్రతిభకు పట్టం కట్టాలంటూ విద్యార్థి సంఘాలు జులైలో ఆందోళనలు చేపట్టాయి. నిరసనలు హింసాత్మకంగా మారడం వల్ల బంగ్లాదేశ్ అగ్నిగుండంలా తయారైంది. దీంతో అవామీ లీగ్ నేతృత్వంలోనే ప్రభుత్వం కూలిపోయింది. అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా దేశాన్ని వీడారు. ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాలో సైన్యం సహాయంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నంత మాత్రాన ఆదేశంతో తమ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినవని బంగ్లాదేశ్లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ప్రమాణస్వీకారం చేశారు.