Bangladesh Violence : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మరోసారి అల్లర్లతో అట్టుడికింది. ఢాకా నగర శివార్లలో వేలాది మంది నిరసనకారులు, అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించగా, 20మందికి పైగా గాయాలయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో జరిగిన హింసాకాండలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్, యువజన విభాగం జుబో లీగ్ క్యాడర్ వీధుల్లోకి రావడం వల్ల ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసనకారులను వారు అడ్డుకునేందుకు యత్నించారు. ఈక్రమంలో ఢాకా శివార్లలోని మున్షిగంజ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈసందర్భంగా పెట్రోల్ బాంబులు పేలినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వచ్చాయి.
వాహనాలకు నిప్పు
ఢాకాలోని షాబాగ్ వద్ద వందలాది మంది విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. డైలీ స్టార్ వార్తాపత్రిక కథనం ప్రకారం ఆదివారం ఉదయం ఢాకాలోని బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ వద్ద అనేక వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. కొందరు వ్యక్తులు ఆస్పత్రి ఆవరణలోని ప్రైవేట్ కార్లు, అంబులెన్స్‌లు, మోటార్‌సైకిళ్లు, బస్సులను కర్రలతో ధ్వంసం చేశారు. దీంతో ఆ ఆస్పత్రిలోని రోగులు, వారి సహాయకులు, వైద్యులు, సిబ్బంది భయాందోళనకు లోనయ్యారని కథనంలో ప్రస్తావించారు.
చర్చలకు సిద్ధమన్న షేక్ హసీనా!
నిరసనకారులతో చర్చలకు తాను సిద్ధమని, వారి కోసం తన కార్యాలయం తలుపులు తెరిచే ఉన్నాయని శనివారం రోజు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు. అయితే అందుకు నిరసనకారులకు సారథ్యం వహిస్తున్న నేతలు అంగీకరించలేదు. షేక్ హసీనా రాజీనామా చేయాల్సిందే అని వారు డిమాండ్ చేశారు. తమ నిరసనల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో నిరసనల్లో పాల్గొంటున్న నేపథ్యంలో దేశంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు, కాలేజీ ప్రిన్సిపాల్స్‌తో హసీనా అత్యవసరంగా సమావేశమయ్యారు. కళాశాలల్లో శాంతిభద్రతల పరిరక్షణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఇక ఛటోగ్రామ్‌లోని బంగ్లాదేశ్ విద్యాశాఖ మంత్రి మొహిబుల్ హసన్ చౌదరి నౌఫెల్ కార్యాలయంపై నిరసనకారులు దాడి చేశారు. ఛటోగ్రామ్ సిటీ కార్పొరేషన్ మేయర్ రెజౌల్ కరీం చౌదరి, అధికార పార్టీ ఎంపీ ఎండీ మొహియుద్దీన్ కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా స్టాండింగ్ కమిటీ సభ్యుడు అమీర్ ఖోస్రు మహమూద్ చౌదరి సహా పలువురు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లోని మూడు జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది.