Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య అదివారం జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు పోలీసులు, ప్రభుత్వాధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు.
అంతేకాకుండా ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళనకారులను అధికార అవామీలీగ్, దాని విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీంతో వాటిని నిరోధించేందుకు పలుచోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి.
పోలీస్ స్టేషన్, షాపింగ్ మాల్‌కు నిప్పు: ఆందోళనకారులు ఢాకాలో ఓ షాపింగ్‌మాల్‌కు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు సిరాజ్గంజ్లోని ఓ పోలీస్ స్టేషన్‌కు సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో 14మంది పోలీసులు మృతి చెందారు. మొత్తం 300 మంది పోలీసులు గాయపడినట్లు పోలీసు ప్రధాన కార్యాలయం వెల్లడించింది.
వాహనాలకు కూడా: దేశవ్యాప్తంగా రోజంతా కొనసాగిన గొడవల్లో దాదాపు 100 మంది మృత్యువాత పడినట్లు బెంగాలీ పత్రిక ప్రొథోం అలో వెల్లడించింది. నార్సింగ్ ప్రాంతంలో అధికార అవామీలీగ్‌కు చెందిన ఆరుగురు నేతలను ఆందోళనకారులు కొట్టి చంపేశారని తెలిపింది. బుల్లెట్ గాయాలతో 56 మంది ఢాకా వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొంది. ఢాకాలో బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ వర్సిటీ వద్ద అనేక వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.
కర్ఫ్యూ
దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఘర్షణల నేపథ్యంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలను నిలిపివేశారు. 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను ఆపేయాలంటూ ప్రభుత్వం మొబైల్ ఆపరేటర్లను అదేశించింది. ప్రజల భద్రత దృష్యా 3రోజుల సెలవులు ప్రకటించారు. మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని ప్రధాని హసీనా పేర్కొన్నారు.
అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లా- మరో 8మంది మృతి- చర్చలకు సిద్ధమంటున్నా కూడా! - Bangladesh Violence