Bangladesh Floods : రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు త్రిపురకు తూర్పున ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోవడం వల్ల రవాణా సౌకర్యాలు స్తంభించిపోయాయి. మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటం వల్ల చాలా ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి. నదుల్లో ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. వేలసంఖ్యలో ఇళ్లు వరదలో మునిగాయి.
దాదాపు 50లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. 11 జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మూడు దశాబ్దాల్లో అత్యంత దారుణమైన వరదలు ఇవేనని బంగ్లా వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలు కొనసాగుతుండటం వల్ల పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ వరదల్లో మరణించినవారి సంఖ్య 30కి పెరిగింది. గత 24గంటల్లో ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సహాయకచర్యలు కూడా ముమ్మురంగా కొనసాగుతున్నాయి. బాధితులను పడవలు, ఇతర వాహనాల్లో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితులకు ఆహారం, మందులు, ఇతర సామగ్రిని అందిస్తున్నారు. వరద బాధితుల కోసం సుమారు 3 వేల 176 షెల్టర్లు, 639 వైద్య బృందాలను నియమించినట్లు స్థానిక ధికారులు తెలిపారు. అయితే వీధుల్లో భారీగా వరదప్రవాహం కొనసాగుతుండటం వల్ల సహాయకచర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర వస్తువుల రవాణా క్లిష్టతరంగా మారినట్లు అధికారులు చెప్పారు.
షేక్ హసీనా దౌత్య పాస్‌పోర్టును రద్దు చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దౌత్య పాస్‌పోర్టును తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడం వల్ల భారత్‌లో ఆమె ఎక్కువకాలం ఆశ్రయం పొందడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత వీసావిధానం ప్రకారం దౌత్య లేదా అధికారిక పాస్‌పోర్టులు కలిగిన బంగ్లాదేశ్ పౌరులు వీసా లేకుండా దేశంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. 45రోజులపాటు ఉండొచ్చు. అయితే షేక్ హసీనా భారత్‌కు వచ్చి ఇప్పటికే 20రోజులు దాటింది. దీంతో భారత్‌లో అధికారికంగా ఉండటానికి గడువు దగ్గరపడుతోంది.
బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంషేక్ హసీనా దౌత్య పాస్‌పోర్టు రద్దు చేయడం వల్ల ఆమెను అక్కడి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే భారత్-బంగ్లాదేశ్ మధ్య 2013లో నేరస్థుల అప్పగింత ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి 2016లో సవరణలు తీసుకొచ్చారు. కోర్టుల్లో నిందితుడిపై విచారణ ప్రారంభమైతే ఒప్పందం ప్రకారం అతడిని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఆ కేసులు రాజకీయ ప్రేరేపితం అయితే తిరస్కరించేలా ఒప్పందం జరిగింది. అయితే హత్య కేసులను రాజకీయ ప్రేరేపితమని గుర్తించడానికి వీల్లేదని ఒప్పందంలో మరో షరతు కూడా ఉంది. షేక్ హసీనాపై బంగ్లా ప్రభుత్వం మెుత్తం 51 కేసులు నమోదు చేసింది. వాటిలో 42 కేసుల హత్యకు సంబంధించినవే ఉన్నాయి.
షేక్ హసీనాను అప్పగించండి - భారత్‌కు 'బంగ్లా' పార్టీ డిమాండ్ - Sheikh Hasina