US Presidential Election 2024 Forecast : ఈసారి జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్‌పై కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, పొలిటికల్ సైంటిస్ట్ అలన్ లిచ్‌మన్ జోస్యం చెప్పారు. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమల హారిస్ బాధ్యతలు చేపడతారని ఆయన అంచనా వేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో గత 40 ఏళ్లుగా కచ్చితమైన రికార్డు ఉన్న అలన్ లిచ్‌మన్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
13కీ ఫార్ములా ప్రకారం అంచనా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అంచనా వేసేందుకు 13కీ ఫార్ములాను తయారు చేశారు అలెన్ లిచ్‌మన్. రష్యన్ జియోఫిజిసిస్ట్ వ్లాదిమిర్ కీలిస్-బోరోక్తో కలిసి 1981లో ఈ ఫార్మూలాను రూపొందించారు. దీన్ని 'కీస్ టు ది వైట్‌హౌస్'గా పిలుస్తారు. 13కీలలో ఆరు కంటే ఎక్కువ కీలు అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా వస్తే, ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోతారని అంచనా. అంతకంటే తక్కువ వస్తే అధికార పార్టీ అభ్యర్థి గెలుస్తారని ఈ ఫార్ములా చెబుతుంది. అమెరికన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ అయిన లిచ్‌మన్ 1984 నుంచి అన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికలను అంచనా వేస్తూ వస్తున్నారు. అన్ని ఎన్నికల్లోనూ ఆయన అంచనాలు నిజం అయ్యాయి.
వ్యతిరేకంగా నాలుగు 'కీ'లే
"ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రాట్లకు వ్యతిరేకంగా నాలుగు కీలు మాత్రమే ఉన్నాయి. అనుకూలంగా 9కీలు ఉన్నాయి. అంటే ఈ ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధిస్తారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ ఈ ఎన్నికల్లో వైట్‌హౌస్‌కు తిరిగిరాలేరు. డెమోక్రాట్లు 2022లో యూఎస్ హౌస్ సీట్లు కోల్పోవడం వల్ల 1కీని కోల్పోయారు. సిట్టింగ్ అధ్యక్షుడు పోటీ నుంచి తప్పుకోవడం వల్ల కీ నంబర్ 3ని వదులకున్నారు. అలా మొత్తంగా నాలుగు కీలు వారికి వ్యతిరేకంగా ఉన్నాయి. అధికార పార్టీ ఓడిపోతుందని చెప్పడానికి ఇంకా రెండు కీలు తక్కువగా ఉన్నాయి. అందుకే అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలుగా కమల విజయం సాధిస్తారని కీలు చెబుతున్నాయి" అని ఎలెన్ లిచ్‌మన్ తెలిపారు.
'ఆర్థిక మాంద్యం లేదు'
ఎన్నికల ఏడాది అమెరికాలో ఆర్థికమాంద్యం లేదని, డెమోక్రాట్లకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారని లిచ్‌మన్ అభిప్రాయపడ్డారు. డెమోక్రాట్లు కమల హారిస్‌కు అండగా నిలబడ్డారని తెలిపారు. "ఎన్నికల ఏడాదిలో అమెరికా ఆర్థిక మాంద్యం లేదు. దీంతో ఎకానమీ కీని డెమోక్రటిక్ పార్టీ అధిగమించింది. సామాజిక అశాంతి, కుంభకోణాలు జరగకపోవడం వల్ల ఈ కీలను ఆ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. విదేశాంగ విధానం కీని కూడా గెలిచారు" అని లిచ్‌మన్ అంచనా వేశారు.
ఉపాధ్యక్ష అభ్యర్థుల గెలుపుపై తాను ఎటువంటి అంచనా వేయలేదని లిచ్‌మన్ తెలిపారు. రిపబ్లికన్ నామినీ డొనాల్ట్ ట్రంప్ మిత్రదేశాలకు వ్యతిరేకంగా మాట్లాడే నాయకుడని పేర్కొన్నారు. హారిస్ విలక్షణమైన నాయకురాలని, మిత్రదేశాలతో కలిసి పనిచేయాలని ఆమె కోరుకుంటారని చెప్పుకొచ్చారు. ట్రంప్ నాలుగేళ్ల పాలన కంటే ప్రస్తుతం అమెరికా పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని లిచ్‌మన్ అభిప్రాయపడ్డారు.
యుద్ధాలను డీల్ చేయడంలో హారిస్ కంటే ట్రంప్ బెటర్: ఒపీనియన్ పోల్
'ట్రంప్ తన అహం, డబ్బు గురించి మాత్రమే పట్టించుకుంటారు': బరాక్ ఒబామా