Alexei Navalny Wife : తన భర్త అలెక్సీ నావల్నీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే చంపారని నావల్నీ భార్య యూలియా నావల్నయా ఆరోపించారు. నావల్నీని మూడేళ్ల పాటు తీవ్ర చిత్రహింసలు, వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు యూలియా వీడియో సందేశం రిలీజ్ చేశారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను నియంత్రించుకుంటూ తీవ్ర భావోద్వేగంతో అందులో మాట్లాడారు. రష్యాలో అవినీతి, అన్యాయం, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అప్పుడే నావల్నీకి సరైన నివాళి అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. నావల్నీ మృతి వెనకక దాగి ఉన్న రహస్యాలన్నింటినీ నిగ్గు తేలుస్తానని ప్రతిజ్ఞ చేశారు. నావల్నీ మృతదేహాన్ని ఇంకా తమకు అందజేయకపోవడంపై విమర్శలు గుప్పించారు.
"నావల్నీని హత్య చేయడం ద్వారా నాలో సగభాగాన్ని పుతిన్ చంపేశారు. నా హృదయం, ఆత్మలో సగం కోల్పోయాను. కానీ, మరో సగం ఇంకా మిగిలే ఉంది. దేశం కోసం నేను పోరాడుతూనే ఉంటా. నావల్నీ చేపట్టిన పనులను కొనసాగిస్తా. స్వేచ్ఛాయుత రష్యాలో నేను జీవించాలనుకుంటున్నా. మీరంతా (రష్యన్లను ఉద్దేశించి) నాతో కలసిరావాలని పిలుపునిస్తున్నా. మన భవిష్యత్‌ను చంపేయాలనుకునే వారికి వ్యతిరేకంగా నా కోపాన్ని, పగను పంచుకోవాలని పిలుస్తున్నా."
-యూలియా నావల్నయా, నావల్నీ భార్య
'నేనూ బాధితుడినే'
మరోవైపు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను నావల్నీతో పోల్చుకున్నారు. నావల్నీ మృతిపై తొలిసారి స్పందించిన ఆయన- సొంత దేశంలో తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను ఆ అంశంతో ప్రస్తావిస్తూ మాట్లాడారు. నావల్నీ తరహాలోనే అమెరికాలో తాను ఓ బాధితుడిననే అర్థం వచ్చేలా 'బైడెన్, ట్రంప్- పుతిన్, నావల్నీ' అనే పేరుతో వచ్చిన వార్తా కథనాలను షేర్ చేశారు. అమెరికా రోజురోజుకు క్షీణిస్తోందని, విఫలదేశంగా మారుతోందని ఆరోపించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. అయితే, అమెరికా సహా పశ్చిమ దేశాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పుతిన్ పేరును ట్రంప్ ప్రస్తావించకపోవడం గమనార్హం.
'అమెరికాను తక్కువ చేయడమేంటి?'
ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ విమర్శలు గుప్పించారు. 'హంతక దుండగుడు అయిన పుతిన్ చర్యలను ఖండించాలి. లేదంటే నావల్నీ ధైర్యాన్ని పొగడాలి కానీ, అదేదీ చేయకుండా అమెరికాను తక్కువ చేస్తూ మన దేశాన్ని రష్యాతో పోలుస్తున్నారు' అంటూ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు.
పుతిన్ ప్రత్యర్థి నావల్నీ హఠాన్మరణం- జైల్లో నడుస్తూ మృతి
'నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు- రష్యా అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ప్రపంచానికి తెలిసింది!'