Palestinian Baby Is Born As Orphan : యుద్ధం ఎంత విధ్వంసం సృష్టిస్తుందో చెప్పడానికి పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే నిదర్శనం. బాంబులు, క్షిపణుల దాడుల్లో ప్రతి రోజూ పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ, వారి కన్నీటి గాథ పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. గాజాలో శనివారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో బాహ్య ప్రపంచంలోకి రాకముందే అనాథ అయింది సబ్రీన్ జౌడా అనే ఓ పసికందు. తల్లిదండ్రులు, 4ఏళ్ల సోదరిని పోగొట్టుకుంది. అందరూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతుంటే, ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసమే ఈ పసికందు ఓ యుద్ధం చేసింది.
ఏం జరిగిందంటే!
ఆ క్షణం వరకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా సబ్రీన్ తన తల్లి గర్భంలో క్షేమంగా ఉంది. కానీ బయట పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. భీకర యుద్ధం జరుగుతోంది. నిర్విరామంగా జరుగుతున్న ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకునేందుకు సబ్రీన్ కుటుంబం ఇంట్లోనే ఓ మూలకు తలదాచుకుంది. ఇంతలో హఠాత్తుగా పెద్ద శబ్దం. సబ్రీన్ ఇంటిపై బాంబు దాడి. శిథిలాలు మీద పడి 30వారాల గర్భవతి సబ్రీన్-అల్-సకానీకి తీవ్ర గాయాలపాలై మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమర్జెన్సీ రెస్పాండర్స్, హుటాహుటిన సకానీని, మృతదేహాలు తీసుకెళ్లే కువైటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు ఎమర్జెన్సీ సిజేరిన్ ఆపరేషన్ చేశారు.
బయట భీకర పోరు జరుగుతుంటే పుడుతూనే మరో యుద్ధం చేసింది పసికందు సబ్రీన్. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి, మరణ అంచులదాకా వెళ్లింది. ఇది గమనించిన వైద్యులు చిన్న గుడ్డ ముక్కని సబ్రీన్ నోట్లోకి మెల్లిగా దూర్చారు. అనంతరం గ్లోవ్స్ వేసుకున్న ఓ చెయ్యి ఆ చిన్నారి చెస్ట్ను తడిమింది. దీంతో సబ్రీన్ ఊపిరి పీల్చుకుంది. అయితే అంతకు కొన్ని సెకన్ల ముందే తన తల్లి సకానీ అనంతలోకాలకు వెళ్లిపోయిందని ఆ పసికందుకు తెలియదు. ఆదివారం చిన్నారిని ఎమిరెటీ ఆస్పత్రికి తరలించి నియోనెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
'అనాథే కాని, ఒంటరి కాదు'
సబ్రీన్ ఆరోగ్యం కొంత పురోగతిలో ఉందని డాక్టర్ మొహమ్మద్ సలామే తెలిపారు. అయితే పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని చెప్పారు. ఈ సమయంలో పసికందు తల్లి గర్భంలో ఉండాలని, ఆ హక్కు సబ్రీన్ కోల్పోయిందని అన్నారు. చిన్నారిని నెలలు నిండని అనాథ బాలికగా అభివర్ణించిన వైద్యుడు, కానీ ఆమె ఒంటరి కాదని చెప్పాడు.
సబ్రీన్ను చూసి ఆమె నాన్నమ్మ అహలం అల్-కుర్ది కన్నీరుమున్నీరయ్యారు. 'ఆమెకు స్వాగతం. ఆమె నా ప్రియమైన కుమారుడి కుమార్తె. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆమే నా ప్రేమ, నా ఆత్మ. ఆమె తన తండ్రి జ్ఞాపకం' అని అల్-కుర్ది అన్నారు.
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో 34,000 మంది పాలస్తీనియన్ల మరణించారని, అందులో కనీసం మూడింట రెండో వంతు మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. శనివారం రాత్రి రఫాలోనే జరిగిన మరో సంఘటనలో ఏకంగా 17 మంది చిన్నారులు ఇజ్రాయెల్ బాంబులకు బలైపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఇద్దరు మహిళలూ ప్రాణాలు కోల్పోయారు.