Bangladesh Iskcon Member Arrest : ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు.. తీవ్ర విమర్శలకు తావిస్తున్న వేళ బంగ్లాదేశ్‌లో మరో హిందూ సాధువును అరెస్టు చేశారు. చిన్మయ్ కృష్ణదాస్‌ను జైలులో కలిసేందుకు వెళుతున్న శ్యామ్ దాస్ ప్రభును ఛొట్టాగ్రామ్‌లో అరెస్టు చేసినట్లు తెలిసింది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే ఈ అరెస్టు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్యామ్‌ను ఎందుకు అరెస్టు చేశారో కూడా ఇప్పటివరకు ఛొట్టాగ్రామ్ పోలీసులు తెలియపర్చలేదు. చిన్మయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం కేసులో అరెస్టుచేయడంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్యామ్‌ప్రభు దాస్ అరెస్టు మరింత చర్చనీయాంశమవుతోంది.
అయితే శ్యామ్‌ప్రభు దాస్ అరెస్ట్‌ను ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ ఎక్స్‌లో వెల్లడించారు. "ఇస్కాన్ సభ్యుడు శ్యామ్‌దాస్ ప్రభును ఎలాంటి వారెంట్ లేకుండా చటోగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా?ఎలాంటి నేరం చేయకుండానే అరెస్టు చేయడం దిగ్భ్రాంతిని కలిగించింది" అని పేర్కొన్నారు. అంతేకాకుండా బంగ్లాలోని ఇస్కాన్ సెంటర్‌ను కొందరు ధ్వంసం చేసినట్లు తెలిపారు.
అక్టోబరు 25న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్ ఆ దేశ జెండాను అగౌరవపరిచారన్న ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదే నెల 30న కృష్ణదాస్‌తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్ వేయగా బంగ్లా హైకోర్టు దానిని కొట్టివేసింది.
ఈ వ్యవహారంలో భాగంగా ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఆయనతో పాటు ఇస్కాన్‌తో సంబంధమున్న మరో 17మందికి బ్యాంకు ఖాతాల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతోన్న దాడులకు వ్యతిరేకంగా పలు సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. దేశంలో హిందువుల భద్రత కోసం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేపట్టనున్నట్లు ఇస్కాన్ వెల్లడించింది. ఈ క్రమంలోనే మరో సభ్యుడు అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది.