Why Do People Harm Themselves : మాగ్జిమమ్.. టీనేజ్ నుంచి యంగ్ ఏజ్‌లో ఉన్నవారిలోనే ఈ తరహా ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కోరుకున్నది దక్కకపోతే కొందరు మౌనంగా ఏడుస్తారు. కొన్ని రోజులకు రీఫ్రెష్ అయిపోతారు. కానీ.. మరికొందరి ప్రవర్తన పూర్తి భిన్నంగా ఉంటుంది. అనుకున్నది దక్కకపోతే అరుస్తారు.. కండిషన్ సీరియస్ నెస్ బట్టి చేతిలో ఏది ఉంటే దాన్ని విసిరికొడతారు.. విషయమ మరింత బలమైనదైతే.. గోడలను బలంగా గుద్దుతూ కత్తులు, బ్లేడ్లతో చేతులు కట్ చేసుకుంటూ ఉంటారు. నిద్ర మాత్రలు కూడా మింగుతారు. ఇలాంటి వారిని చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటారు. మరి.. వీరు ఇలా ఎందుకు చేస్తారు? మానసిక నిపుణులు ఏమంటున్నారు? అన్నది చూద్దాం.
ఒక చక్రంలో ఇరుక్కుపోతారు..
యూకేకు చెందిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ బృందం ఓ అధ్యనం జరిపింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి మానసిక ప్రవర్తనను విశ్లేషించింది. తమను తాము గాయపరుచుకునే వాళ్లు.. 'సెల్ఫ్ హార్మ్ సైకిల్' (Self-harm cycle) చుట్టూ తిరుగుతారట. ప్రధానంగా రెండు కారణాలతో ఇలా చేసుకుంటారట. ఒకటి.. తమ మానసిక బాధను తక్షణం తగ్గించుకోవడంలో భాగంగానే గోడలను బలంగా కొట్టడం, చేతిలో ఉన్న వస్తువులను విసిరికొట్టడం వంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆవేశం బయటకు వెళ్లి, కొంత ఉపశమనం కలుగుతుంది. రెండో కారణం.. తమ బాధను ఎదుటి వ్యక్తులకు తెలియజేయడం. ఎవరి మీదనైతే కోపంగా ఉన్నారో.. ఎవరి వల్లనైతో బాధపడుతున్నారో.. వారికి తమ బాధ తీవ్రత తెలియాలనే ఉద్దేశంతోనే చేతులను కత్తులు, బ్లేడుతో కోసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
తమను తాము గాయపరచుకోవడానికి కొన్ని కారణాలు..
- ఇంట్లో ఆర్థికపరమైన, కుటుంబ పరమైన ఇబ్బందులు
- ప్రేమ విఫలమైపోవడం
- స్నేహితులతో గొడవలు
- స్కూళ్లు, కాలేజీల్లో ఒత్తిడి
- సైబర్ బెదిరింపులు
- జీవితంపై నిరాశగా ఉండటం
- డిప్రెషన్‌కు గురికావడం
- ఆత్మగౌరవం దెబ్బతిందని భావించడం
- సిగరెట్, మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడటం
ముదిరితే ప్రమాదం..
ఇలాంటి బాధల్లో ఉన్నవారు మానసికంగా మరింతగా కుంగిపోతే ఆత్మహత్య చేసుకోవడం వంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. లేదంటే మరేదైనా దారుణం చేసేందుకూ సిద్ధపడొచ్చు. కాబట్టి.. వారిని వీలైనంత త్వరగా ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పని కుటుంబ సభ్యులు, ఆత్మీయులు చేయాలని చెబుతున్నారు.
వీరిని ఎలా గుర్తించాలి? ఏ విధంగా సహాయం చేయాలి?
- ఎప్పుడూ నిరాశ, నిస్పృహలతో ఉంటారు.
- ఎల్లప్పుడూ నెగెటివ్‌గానే మాట్లాడుతుంటారు.
- ఈ ప్రపంచంలో తమకు వచ్చిన కష్టం మరెవరికీ లేదన్నట్టుగా ఫీలవుతుంటారు.
- భవిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలు వంటివి ఏవీ లేకపోగా.. జీవితం ముగిసిపోయినట్టుగా మాట్లాడుతుంటారు.
- పరిస్థితి మరింత తీవ్రమైనప్పుడు.. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు.
- ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు మూడు రోజులు ఎవ్వరితోనూ సరిగా మాట్లాడరు. ఒంటరిగా ఉంటారు. చీకట్లో కూర్చుంటారు.
అండగా ఉండాలి..
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు అండగా నిలవాలి. జీవితంపై భరోసా కలిగించేలా మాట్లాడాలి. ఇప్పుడున్న దశ ఒక చిన్న మబ్బులాంటిదేనని.. త్వరలోనే అది వెళ్లిపోతుందని ధైర్యం చెప్పాలి. ఓటమి నుంచి జీవితాన్ని గెలిచిన వారి స్ఫూర్తి గాథలు వినిపించాలి. ఈ ప్రపంచంలో కష్టాలు పడుతూ ముందుకు సాగుతున్న వారిని చూపించాలి. వీటితోపాటు అసలు వారి సమస్య ఏంటో తెలుసుకుని, పరిష్కారానికి ఉన్న అవకాశాలు వెతకాలి. చావు పరిష్కారం అసలే కాదని అర్థం చేయించాలి. ఇన్ని చేసినా కుదటపడకపోతే.. సాధ్యమైనంత త్వరగా మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.
అలర్ట్ : ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే స్ట్రెస్ పెరగడం ఖాయం!