Tooth Sensitivity Causes: మనలో చాలా మందికి చల్లటి లేదా వేడి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు దంతాలు జివ్వుమని లాగుతుంటాయి. ఫలితంగా భరించలేనంత నొప్పిని అనుభవిస్తుంటారు. దంతాల స్వరూపంలో కలిగిన మార్పులే ఇందుకు కారణమని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు ఈ సమస్యకు గల ప్రధాన కారణాలు ఏంటి? పరిష్కార మార్గాలు ఏంటనే అంశాలను ప్రముఖ డెంటిస్ట్ డా.గోపినాథ్ అన్నే వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"మన దంతాల మీద పింగాణి ఎనామిల్ ఉంటుంది. ఇది పళ్లను రక్షించే ఒక రక్షణ కవచం లాంటిది. పళ్లను రక్షించే పింగాణి ఎనామిల్ కింద డెంటింన్ అనే మరో పొర ఉంటుంది. ఇది మరో రకమైన రక్షణ కవచంలా చెప్పుకోవచ్చు. దాని కింద పంటికి సంబంధించిన నరాలు, రక్తనాళాలు ఉంటాయి. పంటి మీద ఎనామిల్, డెంటిన్ గట్టిగా ఉన్నంత కాలం ఎలాంటి ఇబ్బందీ రాదు. ఎప్పుడైతే పంటికి రక్షణగా ఉండే ఎనామిల్ దెబ్బతింటుందో అప్పుడు వేడిగా లేదంటే చల్లగా ఏదైనా తిన్నప్పుడు జివ్వుమని లాగే సమస్య మొదలవుతుంది."
-డాక్టర్ గోపినాథ్, డెంటిస్ట్
అయితే పంటికి రక్షణనిచ్చే ఎనామిల్ దెబ్బతినడానికి రకరకాల కారణాలు ఉండవచ్చని డాక్టర్ గోపినాథ్ అంటున్నారు. ఎక్కువగా బ్రషింగ్ చేయడం, మరీ బలంగా లేదా కఠిన పోచల బ్రష్‌తో తోమటం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతినడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. కొన్నిసార్లు పుల్లటి పండ్ల వంటి ఆమ్ల పదార్థాలు తినటం వల్ల యాసిడ్ ఎఫెక్ట్‌తో ఎనామిల్ దెబ్బతిని ఇలాంటి సమస్య తలెత్తవచ్చని వివరించారు. ఇంకా చిగుళ్ల వాపు వంటి జబ్బుల వల్ల కూడా ఇలాంటి సమస్య రావడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. కొంతమందిలో ఎనామిల్ సహజంగానే పలుచగా ఉండవచ్చని అందువల్ల కూడా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పరిష్కారం ఏంటంటే?
కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ వాడటం, మెత్తటి బ్రష్‌తో సరైన పద్ధతిలో తోముకోవటం, పుల్లటి పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉండటం, ఫ్లోరైడ్ ద్రావణంతో పుక్కిలించటం వంటివి మేలు చేస్తాయని సలహా ఇస్తున్నారు. ఇవే కాకుండా వైద్యులను సంప్రదిస్తే ఇతర చికిత్సల ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.