Biscuits Side Effects in Children in Telugu: చిన్న పిల్లలు ఏడిచినప్పుడు, ఆకలి వేసినప్పుడు వారికి బిస్కెట్లు ఇస్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలు సైతం వాటిని చాలా ఇష్టంగా తింటుంటారు. చాలా మంది తల్లులు పాలిచ్చిన తర్వాత పిల్లలకు కచ్చితంగా బిస్కెట్లను తినిపిస్తుంటారు. ఇక ప్రయాణాల్లో సైతం వీటిని తీసుకెళ్తుంటారు. అయితే ఇలా పిల్లలకు బిస్కెట్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఊబకాయం, షుగర్: సాధారణంగా బిస్కెట్లను మైదా, హానికరమైన కొవ్వులు, అధిక సోడియం, పంచదార, కృత్రిమ స్వీటెనర్లు వంటివి ఉపయోగించి తయారు చేస్తుంటారు. ఈ పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు నిపుణులు. వీటిని తిన్న పిల్లల శరీరంలో కేలరీలు పెరిగిపోతాయని.. ఫలితంగా వారు విపరీతంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు. దీంతో పాటు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
2018లో జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. బిస్కెట్లలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని.. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని University of Liverpoolలో న్యూట్రిషనల్ సైన్స్‌లో ప్రొఫెసర్ డాక్టర్ Emma Boyland పాల్గొన్నారు. ఇదే విషయాన్ని NIH బృందం కూడా వెల్లడించింది.(National Librabry of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఇవే కాకుండా ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అవేంటంటే..
మలబద్ధకం: బిస్కెట్ల తయారీలో వాడే శుద్ధి చేసిన గోధుమ, మైదా పిండి రెండూ ఆరోగ్యానికి మంచివి కావని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే గోధుమ పిండిని ప్రాసెస్ చేయడం వల్ల దానిలో పోషకాలు లేకుండా పోతాయట. ఇక మైదా పిండి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని అంటున్నారు. కాబట్టి వీటితో తయారు చేసిన బిస్కెట్లను పిల్లలకు తినిపించడం వల్ల వారి జీర్ణక్రియ నెమ్మదిస్తుందని వివరించారు. పిల్లల్లో ప్రేగుల పనితీరును కూడా నెమ్మదించి.. పెరుగుదలపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఇదే కాకుండా పిల్లలకు మలబద్దకం సమస్య వస్తుందని తెలుపుతున్నారు.
జీర్ణ, దంత సమస్యలు: సాధారణంగా బిస్కెట్లను ప్రాసెస్ చేసిన పిండి, కృత్రిమ రుచులు, సోడియం, కొవ్వులు, రంగులతో తయారుచేస్తారు. ఇలాంటి ఆహార పదార్థాల వల్ల పిల్లల ఆరోగ్యం ఎంతో ప్రభావితం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. వీటిని తిన్న పిల్లలకు జీర్ణ సమస్యలతో పాటు కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. అలాగే బిస్కెట్లను ఎక్కువగా తినడం వల్ల దంత సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.
వ్యసనంలా చేస్తుంది: బిస్కెట్లలో ఎక్కువగా ఉండే కొవ్వు, చక్కెర, ఉప్పు రుచిని ఇచ్చి ఎక్కువగా తినాలనే కోరికలను పిల్లల్లో పెంచుతాయని చెబుతున్నారు. ఫలితంగా వీటికి బానిసలుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల పిల్లల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతాయని వివరిస్తున్నారు. అంతే కాకుండా పిల్లల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుందని తెలుపుతున్నారు. ఫలితంగా వారు తల్లిపాలను మానేసి కేవలం బిస్కెట్లను మాత్రమే తినాలని చూస్తుంటారని పేర్కొన్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.