What happens if drink fridge water in summer : ఎండలు మండిపోతున్నాయి. దీంతో.. జనాలు చల్లదనం వెంట పరుగులు తీస్తుంటారు. ఈ వేడిలో చల్లచల్లగా గొంతు దిగుతుంటే అద్భుతంగా ఉంటుందంటూ.. ఫ్రిజ్ నీళ్లు తాగేస్తుంటారు. అయితే.. ఫ్రిజ్ నీళ్లు తాగితే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చల్లగా ఉండే నీళ్లు తాగాలని అనిపించడం సహజం. కానీ.. ఆ కూలింగ్ మన గొంతుపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు.. వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీ దేవి ఈ విషయమై మాట్లాడుతూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
చాలా మంది ఫ్రిజ్‌లో చల్లటి నీళ్లు తాగి.. పని మీద బయటకు వెళ్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు. దీనివల్ల ఒంట్లోని చల్లటి నీరు.. బయటి ఎండ తీవ్రత బ్యాలెన్స్ తప్పడం వల్ల.. వడ దెబ్బ తగులుతుందని హెచ్చరిస్తున్నారు. వడ దెబ్బ ఎంత తీవ్రమైనదో తెలిసిందే. ప్రతిఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరికొందరు బయటకు వెళ్తున్నప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్‌లో ఫ్రిజ్ నీళ్లు నింపుకొని తీసుకెళ్తుంటారు. ఎండలో ప్లాస్టిక్ కరిగిపోయి.. అది నీళ్లలో కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. కరిగిన ప్లాస్టిక్‌లో పలు విష రసాయనాలు ఉంటాయి. ఆ నీటిని తాగితే శరీరానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. వీలైతే మట్టితో తయారైన సీసాలు తీసుకుపోవడం మంచిదని సూచిస్తున్నారు. మార్కెట్లో.. మట్టితో తయారుచేసిన టెర్రకోటా బాటిల్స్ రకరకాల మోడల్స్‌లో దొరుకుతున్నాయి.
ఎండలో తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రిజ్ నీళ్లు తాగడం కూడా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో ఉన్నప్పు మన శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పటి వరకూ ఎండలో ఉండి.. సడెన్‌గా ఇంట్లోకి వచ్చి అత్యంత చల్లగా ఉండే ఫ్రిజ్ నీళ్లను తాగితే.. రెండు ఉష్ణోగ్రతల మధ్య భారీ తేడా ఏర్పడుతుంది. ఫలితంగా.. రక్తనాళాలు, గుండెపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. మరీ చల్లటి నీళ్లు తాగకూడదని సూచిస్తున్నారు. అది కూడా వెంటనే తాగకుండా ఓ 10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.
అతి చల్లగా ఉండే నీళ్లు తాగితే పొట్ట ఆరోగ్యం పైన కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ ఇబ్బంది ఎదుర్కొంటుందని.. తిన్నది సరిగా జీర్ణం కాకపోయే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఫ్రిజ్ నీళ్లకు బదులుగా కుండ నీళ్లు తాగితే మంచిదని, ఇది అన్ని విధాలా శ్రేయస్కరమని సూచిస్తున్నారు.