Weight Gain Causes in Women: ఈరోజుల్లో చాలా మంది మహిళలు రకరకాల కారణాలతో బరువు పెరిగిపోతున్నారు. సరైన ఆహారం తీసుకున్నా సరే.. ఇలా బరువు ఎందుకు పెరుగుతున్నాము అని ఆందోళన చెందుతుంటారు. బరువు పెరగడానికి ఆహారం ఒక్కటే కారణం కాదని.. మన శరీరంలో ఉన్న వ్యాధులు కూడా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయని సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ కే శివరాజు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బరువు పెరగడానికి గల కారణాలు తెలుసుకుందాం.
హైపోథైరాయిడిజం
మహిళల్లో ఎక్కువగా థైరాయిడ్ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ జీవ క్రియను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ శరీరానికి అవసరమైన మోతాదు కంటే తక్కువగా విడుదలవ్వడం వల్ల జీవక్రియలు తగ్గడంతో పాటు బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
కుషింగ్స్ సిండ్రోమ్
కుషింగ్స్ సిండ్రోమ్ కూడా అధిక బరువు పెరుగుదలకు కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలపై ఉండే అడ్రినల్ గ్రంధులు కార్టిసైల్ అనే హర్మోన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. ఇది మన దేశంలో తక్కువగా ఉన్నప్పటికీ.. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉందని తెలిపారు.
నిద్రలేమి
బరువు పెరగడానికి కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటని అంటున్నారు. రాత్రుళ్లు ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి శరీరంలో కొవ్వు ఎక్కువగా పెరిగిపోతుందట. నిద్ర లేకపోవడం వల్ల శరీరం కార్టిసైల్, ఇన్సులిన్ హర్మోన్లను అధికంగా ఉత్పత్తి చేస్తుందని.. ఇది బరువు పెరిగేలా చేస్తుందని వివరించారు. ఆకలిని కలిగించే హార్మోన్లు సైతం గందరగోళానికి గురై అధిక ఆహారం తీసుకునేలా చేస్తాయట.
ఒత్తిడి, డిప్రెషన్
బరువు పెరుగుదలకు మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కూడా కారణం అవుతుందని చెబుతున్నారు. వీటివల్ల హర్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆకలి ఎక్కువగా వేస్తుందని.. ఫలితంగా ఆహారం ఎక్కువగా తీసుకుంటామన్నారు. దీంతో బరువు పెరుగుతామని, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరగడానికి అవకాశాలు ఎక్కువని అంటున్నారు.
పీసీఓఎస్, మెనోపాజ్
హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వేధిస్తుంది. పీసీఓడీ, పీసీఓఎస్ సమస్య ఉన్నవారిలో కూడా బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మెనోపాజ్ దశ వచ్చిన సమయంలోనూ బరువు పెరిగే అవకాశం ఉంటుందట. హార్మోన్స్ తగ్గడం వల్ల జీవక్రియ నెమ్మదించి బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఆ మందుల వాడినా..
అధికంగా మాత్రలు తీసుకునేవారిలోనూ బరువు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భ నియంత్రణ కోసం వాడే మాత్రల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా స్టెరాయిడ్స్, కొన్ని రకాల మానసిక సమస్యలకు ఇచ్చే మందులు వాడడం వల్ల కూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. కీళ్ల నొప్పులు, రుమాటాయిడ్, అర్థరైటిస్, వాపు ఉన్న వారు వాడే మందుల వల్ల కూడా బరువు పెరుగుతారట. అందువల్ల వైద్యులను సంప్రదించి కారణాలు తెలుసుకుని వ్యాధులకు చికిత్స తీసుకుంటే బరువు అదుపులోకి వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.