Hug Benefits for Health in Telugu: మనలో చాలా మంది బాధేసినా, సంతోషమైనా ఎదుటివారిని గట్టిగా కౌగిలించుకుంటారు. ఇలా చేయడం వల్ల మనసులోని భావోద్వేగాలు అదుపులోకి వస్తాయని నిపుణులూ చెబుతుంటారు. భావోద్వేగాలే కాకుండా ఇద్దరికీ అనేక ప్రయోజనాలు అందుతాయని పరిశోధకులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"శంకర్ దాదా జిందాబాద్" సినిమాలో హాస్పిటల్ స్వీపర్ చాలా కోపంలో ఉంటాడు. ఆ సమయంలో శంకర్ ఇచ్చిన ప్రేమ పూర్వక కౌగిలితో అతను వెంటనే నార్మల్ అయిపోతాడు. అచ్చం ఇదేవిధంగా.. నిజ జీవితంలోనూ కౌగిలికి అంత పవర్ ఉందని చెబుతున్నారు నిపుణులు! మన స్నేహితులు, కుటుంబ సభ్యులు కష్టంలో ఉన్నప్పుడు.. వాళ్లకు చిన్న హగ్ ఇవ్వడం ద్వారా నేనున్నా అనే భరోసా ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. తీరని దుఃఖంలో మునిగినవారిని దగ్గరకు తీసుకుని కౌగిలించుకోవడం వల్ల మంచి సానుభూతిని అందించొచ్చని అంటున్నారు. ఒత్తిడి నుంచి బయటకు తేగలిగే శక్తి మనమిచ్చే కౌగిలికెంతో ఉందని అభిప్రాయపడుతున్నారు.
Nature జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. భద్రతాభావాన్ని ప్రోత్సహించే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుందని తేలింది. Oxytocin increases trust in humans అనే అంశంపై చేపట్టిన ఈ పరిశోధనలో జర్మనీలోని University of Freiburgలో సైకాలజీ ప్రొఫెసర్ Markus Heinrichs పాల్గొన్నారు. కౌగిలి ఇవ్వడం ద్వారా.. తమ కోసం ఒకరున్నారనే భావనను కలిగించి వాళ్లకు ఉపశమనాన్ని అందిస్తుందని వెల్లడైంది.
సాన్నిహిత్యం పెరుగుతుంది..
ఇంకా ప్రేమబంధంలో తరచుగా కౌగిలించుకునే వ్యక్తుల్లో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ప్రియమైనవారు ఒకరినొకరు కౌగిలించుకున్నప్పుడు ఇరువురిలోనూ ఎండార్ఫిన్ విడుదలవుతుందని.. ఫలితంగా ఒత్తిడి దూరమై ఆనందం కలుగుతుందన్నారు. మనసుకు నచ్చినవారితో అనుబంధాన్ని ఓ చిన్న హగ్ బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎదుటివారిలో సంఘర్షణ కలుగుతున్నప్పుడు.. వారిని కౌగిలించుకుంటే ఆక్సిటోసిన్ విడుదలై వారిపై వారికి నమ్మకాన్ని పెంచుతుందన్నారు. ఇది ఇరువురి మధ్య సాన్నిహిత్యాన్నీ బలోపేతం చేస్తుందని వివరించారు.
ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది..
చిన్నారులు ఆడుకునే సమయంలో తగిలే గాయాలు, స్నేహితులతో జరిగే చిన్న గొడవలు వారిని తీవ్ర వేదనకు గురిచేస్తుంటాయి. ఇంకా కష్టపడి చదివినా అనుకున్న ర్యాంకు సాధించలేకపోతున్నామనే బాధ విద్యార్థి దశలో చాలా మందిలో కలుగుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పిల్లలను తల్లిదండ్రులు ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకుంటే సరిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్లలో భద్రతాభావాన్ని ప్రోత్సహించే ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతున్నారు. ఇదే కాకుండా లక్ష్యాన్ని ఛేదించగలమనే నమ్మకం వస్తుందని అంటున్నారు.
కుటుంబ బంధాలను బలోపేతం చేయడమే కాకుండా.. అనారోగ్యంగా ఉన్నవారికి బాధ నుంచి ఉపశమనాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఆందోళనను ఎదుర్కొనే శక్తినిచ్చి రిలాక్స్‌గా ఉంచుతుందని అంటున్నారు. తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంపొందించి తద్వారా రోగనిరోధక వ్యవస్థను పెంచేలా దోహదపడుతుందని వెల్లడించారు. ముఖ్యంగా రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలూ చెబుతున్నాయి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు "స్టోన్ ఫ్రూట్స్" గురించి తెలుసా? - అధిక రక్తపోటు నుంచి క్యాన్సర్ల వరకు అన్నింటికీ దివ్యౌషధం!