Health Benefits Of Walking 10,000 Steps A Day : నేటి ఆధునిక కాలంలో జీవన శైలి మారింది. చాలా మంది ఉద్యోగం, వ్యాపారం అంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో శారీరక వ్యాయామం చేయడం తగ్గింది. అందుకే.. కనీసం రోజుకు కొంత దూరమైనా నడవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 'రోజుకు 10 వేల అడుగులు' నడవాలనే ఒక కాన్సెఫ్ట్ తెరపైకి వచ్చింది. మరి, ఆరోగ్యంగా ఉండడానికి నిజంగా 10 వేల అడుగులు సరిపోతాయా? లేదంటే ఎక్కువ నడవాలా? తక్కువ నడవాలా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు 10వేల అడుగుల కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే?
నిజానికి.. డైలీ 10వేల అడుగులు నడిస్తే హెల్త్‌కు మంచిదనే సలహా శాస్త్రవేత్తల నుంచి వచ్చింది కాదు. 1964 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జపాన్‌కు చెందిన గడియారాల కంపెనీ ‘యమసా’ తమ ప్రొడక్ట్స్ కోసం ఇచ్చిన ఓ యాడ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చింది. అంతేకాదు.. ఆ టైమ్‌లో కొత్తగా ఓ ‘పెడోమీటర్’ను ఆవిష్కరించింది యమసా కంపెనీ. అది మెటల్ బాల్‌తో ఉండే ఒక లెక్కింపు డివైజ్. దాన్ని మనం నడుముకు ధరించడం ద్వారా రోజుకు ఎన్ని అడుగులు వేశామో కౌంట్ చేస్తుంది. ఒలింపిక్స్ టైమ్స్‌లో ఆ పరికరానికి విశేష ఆదరణ దక్కింది. ఆ తర్వాతే ప్రపంచవ్యాప్తంగా 'రోజుకు 10వేల అడుగులు' అనే మాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ కాన్సెప్ట్‌పై శాస్త్రవేత్తలు కూడా అధ్యయనం చేయడం మొదలుపెట్టారట.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..?
'రోజుకు 10వేల అడుగులు' అనే కాన్సెప్ట్‌పై గత సంవత్సరం అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ, పోలండ్‌లోని లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించాయి. ఇందుకోసం దాదాపు 2.26లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే డైలీ ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు. మనం వేసే అడుగుల సంఖ్యను బట్టి వివిధ ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వారు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
- రోజుకు దాదాపు 4వేల అడుగులు నడవడం ద్వారా అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు.. ఇది అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుందన్నారు. అలాగే అధికబరువు/ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుందని వారు కనుగొన్నారు.
- డైలీ 2,337 అడుగులు నడిస్తే గుండె సంబంధిత (కార్డియోవాస్కులర్) జబ్బులతో మరణించే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని కనుగొన్నారు.
- అదేవిధంగా.. రోజుకు 1000 అడుగుల చొప్పున నడకను అదనంగా పెంచుకుంటూ పోతే గుండెజబ్బుల మరణాలు 15 శాతం తగ్గిపోతాయని, 500 అడుగుల చొప్పున పెంచుకుంటూ పోతే.. హార్ట్ ప్రాబ్లమ్స్ 7 శాతం మేర తగ్గుతాయని పరిశోధకులు కనుగొన్నారు.
- ఇకపోతే 60 ఏళ్లు దాటినవారు రోజుకు 6 వేల అడుగుల నుంచి 10 వేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుందని ఈ పరిశోధకులు పేర్కొన్నారు.
తిన్న తర్వాత కేవలం 10 నిమిషాలు నడవండి - మీ శరీరంలో ఊహించలేని మార్పు!
చిన్న లక్ష్యాలతో ఆరోగ్యానికి మేలు :
- ఇప్పటికీ రోజూ గరిష్ఠంగా ఎంత నడవాలనే విషయంలో స్పష్టత లేదు. అయితే, ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచి లాభాలుంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు.
- మెరుగైన హెల్త్ బెనిఫిట్స్ కోసం 8వేల నుంచి 10వేల అడుగులు నడవడం అనేది బెటర్ అంటున్నారు. కాబట్టి వీలైనంత యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం మంచిదని చెబుతున్నారు.
- కనీసం రోజుకు అరగంట అయినా వర్కౌట్ చేసేలా చూసుకోవాలంటున్నారు. ఫలితంగా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు పొందవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.
- అయితే, ఒక్క రోజులోనే 10వేల అడుగులను రీచ్ అవ్వలేకపోవచ్చు. అంతేకాదు.. కొన్నిసార్లు వేగంగా నడవాలన్న ప్రయత్నంలో గుండె మీద ఒత్తిడి పడుతుందనే విషయాన్ని గమనించాలంటున్నారు.
- కాబట్టి ముందుగా 2,500 నుంచి 3000లతో స్టార్ట్ చేసి నెమ్మదిగా ప్రతి 15రోజులకి 500 చొప్పున పెంచుకుంటూ వెళ్లినా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.
- అధిక బరువు ఉన్నవాళ్లు 1000 అడుగులతో మొదలుపెట్టినా చాలంటున్నారు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం వైద్య నిపుణులు, పరిశోధకుల అధ్యయనాలను పరిశీలించి ఇచ్చినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై ముందుగా వైద్యులను సంప్రదించిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడమే మంచిది.!
హెల్దీగా ఉండటానికి - ఏ వయసువారు ఎంత దూరం నడవాలి ? మీకు తెలుసా ?